పొంచివున్న కరోనా థర్డ్ వేవ్ ముప్పు : ఆక్సిజన్ ప్లాంట్లపై ప్రధాని రివ్యూ

శుక్రవారం, 9 జులై 2021 (15:21 IST)
దేశంలో కరోనా వైరస్ మూడో దశ అల తప్పదని పలువురు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా, ఈ దశలో చిన్నపిల్లలపై ఈ వైరస్ అధిక ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 
 
ఆక్సిజన్ నిల్వలు, సరఫరాకు సంబంధించిన అంశాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. సెకండ్ వేవ్‌లో చాలా ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా కాకపోవడంతో అనేక మంది చనిపోయిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందే అప్రమత్తమైంది.
 
ఆక్సిజన్ కొరత లేకుండా చూసేందుకు దేశవ్యాప్తంగా ప్రెజర్ స్వింగ్ అడ్జార్ప్షన్ (పీఎస్ఏ) ఆక్సిజన్ ప్లాంట్లను కేంద్రం ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం వాటి నిర్మాణం వేగంగా జరుగుతోందని, త్వరలోనే 1,500 ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయని ప్రధానికి అధికారులు వివరించారు. ఈ ప్లాంట్ల ద్వారా 4 లక్షల పడకలకు ప్రాణవాయును సరఫరా చేయొచ్చని చెప్పారు.
 
అలాలగే, ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ, వాటిని ఆపరేట్ చేసే విధానంపై ఆసుపత్రుల సిబ్బందికి శిక్షణనివ్వాలని సూచించారు. దీనిపై ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించామని, 8 వేల మందికి శిక్షణనిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు