ఎవర్నీ వదిలిపెట్టం, అందరికీ వ్యాక్సిన్ వేస్తాం: అనిల్‌కుమార్ సింఘాల్

మంగళవారం, 11 మే 2021 (14:39 IST)
అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ వేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. కొవిడ్ నివారణలో విధులు నిర్వర్తిస్తున్న తాత్కాలిక పారామెడికల్ సిబ్బందికి వెయిటేజ్ మార్కులు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీచేసిందన్నారు. జిల్లా కలెక్టర్ల నుంచి అనుమతులు పొందిన ప్రైవేటు ఆసుపత్రులను ఆరోగ్య శ్రీ పథకం కిందకు తీసుకొచ్చిన్నట్లు ఆయన వెల్లడించారు.

ఆ ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవలు ఇకపై అందుతాయన్నారు. 45 ఏళ్లకు పైబడిని వారికే రెండు డోసులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. మంగళిగిరిలోని ఏపీఐఐసీలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడ‌చిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,05,494 కరోనా టెస్టులు చేయగా, 22,164 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని, 92 మంది మృతి చెందారని తెలిపారు. తక్కువ సంఖ్యలో విజయనగరంలో 998 కేసులు, ప్రకాశం 980 కేసులు నమోదయ్యాయని తెలిపారు. కడపలో 1,268 కేసుల నమోదయ్యని, ఆ జిల్లాలో ఎటువంటి మరణాల సంభవించలేదన్నారు. 
 
అనుమతులు పొందిన ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ పరిధిలోకి...
కరోనా వైద్య సేవల కోసం జిల్లా కలెక్టర్ల నుంచి అనుమతులు ప్రైవేటు ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ పథకం కిందకు తీసుకొస్తున్న‌ట్లు తెలిపారు. ఆరోగ్య శ్రీ పథకం కింద సేవలు పొందే రోగులకు అన్ని ఆసుపత్రుల్లోనూ అడ్మిషన్లు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 637 ఆసుపత్రుల్లో కరోనా వైద్య సేవలు అందిస్తున్నారన్నారు.

ఆయా ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్లు 6,870 ఉన్నాయని, వాటిలో 6,323 బెడ్లు రోగులతో నిండాయని, ఇంకా 547 బెడ్లు ఖాళీ గాఉన్నాయని తెలిపారు. వాటిలో కర్నూలులో అత్యధికంగా 281 బెడ్లు ఖాళీ ఉన్నాయన్నారు. అనంతరపురం, శ్రీకాకుళం, విశాఖపట్నలో జిల్లాల్లో  ఐసీయూ బెడ్లు ఖాళీగా లేవని తెలిపారు. ఆక్సిజన్ బెడ్లు విషయానికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా 23,259 బెడ్డులు ఉండగా, వాటిలో 22,265 బెడ్లు రోగులతో నిండిపోయాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొవిడ్ కేర్ సెంటర్లలో 15,100 మంది చికిత్స పొందుతున్నారన్నారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 3,417 మంది, కర్నూలులో 2,956 మంది ఉన్నారన్నారు. 
 
రోజు రోజుకూ ఆక్సిజన్ సప్లయ్ పెరుగుదల...
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం ఆక్సిజన్ సరాఫరా రోజు రోజుకూ పెంచుతోందన్నారు. 330 టన్నులతో ప్రారంభమైన సరఫరా నేటికి 560 టన్నులు వరకూ పెరిగిందన్నారు.  ఆక్సిజన్ సరఫరా పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వినతిని మన్నిస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చే కోటాను పెంచిందన్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రానికి కేంద్రం నుంచి 590  టన్నుల ఆక్సిజన్ వచ్చిందన్నారు.

రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం 561 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ అందజేసిందన్నారు. శనివారం కన్నా 90 టన్నుల అధికంగా సరఫరా చేశామన్నారు. రెమిడెసివిర్ ఇంజక్షన్ల విషయానికొస్తే... గడిచిన 24 గంటల్లో 24,861 ఇంజక్షన్లను ప్రభుత్వాసుపత్రులకు అందజేశామన్నారు. 342 ప్రైవేటు ఆసుపత్రులకు 13,461 ఇంజక్షన్లు సరఫరా చేశామన్నారు. వాటిలో ప్రైవేటు ఆసుపత్రులు సొంతగా 7,427 కొనుగోలు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం 6,034 ఇంక్షన్లు అందజేసిందన్నారు. 
 
నేటి వరకూ కాల్ సెంటర్ కు 2.08 లక్షల ఫోన్ కాల్స్...
గత నెల 16న 104 కాల్ సెంటర్ ను మరింతగా అభివృద్ధి చేశామని, ఆనాటి నుంచి నేటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 2,08,528 కాల్స్ వచ్చాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్  తెలిపారు. గడిచిన 24 గంటల్లో 15,926 ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. ఆ కాల్స్ లో వివిధ రకాల సమాచారం కోసం 6,965 కాల్స్ రాగా, అడ్మిషన్లు కోసం 3,652  కొవిడ్ టెస్టులకు 2,904, టెస్టు రిజల్ట్ కోసం 1,914 ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు.
 
45 ఏళ్ల వారికే వ్యాక్సిన్ల పంపిణీకి కేంద్రం అంగీకారం...
రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడిన వారికి తొలుత వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించామని, ఇందుకు అనుమతి కావాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం అందిందని ఆయన తెలిపారు. వ్యాక్సిన్ కోసం అభివృద్ధి పరిచిన కొవిన్ అప్లికేషన్ ను రెండు రోజుల్లో మార్పు చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపిందన్నారు. సీరమ్ నుంచి మూడున్నర లక్షల కొవిషీల్డ్ డోసులు, భారత్ బయోటెక్ నుంచి 1.42 లక్షల కొవాగ్జిన్ డోసులు వచ్చాయన్నారు. రెండ్రోజుల్లో అప్లికేషన్లో మార్పులు చేసిన తరవాత ఈ వ్యాక్సిన్లను పంపిణీ చేస్తామన్నారు.
 
కోవిడ్.. పారామెడికల్ సిబ్బందికి వెయిటేజ్ పెంపు...
గతేడాది కొవిడ్ సేవలు అందించడానికి తాత్కాలిక ప్రాతిపదికన 19 వేలకు మందికి పైగా నియమించామన్నారు. ఈ ఏడాది కూడా కొవిడ్ సేవల కోసం పారామెడికల్ సిబ్బందిని నియమించుకున్నామన్నారు. కష్టకాలంలో పనిచేస్తున్న తమకు శాశ్వత ప్రాతిపదిక ప్రభుత్వం నియమించే పోస్టుల్లో అవకాశమివ్వాలని వారు కోరుతున్నారన్నారు. వారి వినతిని రాష్ట్ర ప్రభుత్వం మన్నించిందన్నారు. గతంలో ఆయా ప్రభుత్వ శాఖల్లో పనిచేసిన వారికి ఎక్స్ పీరియన్స్ కింద వెయిటేజ్ ఇచ్చేవారన్నారు.

ఏజెన్సీలో 6 నెలలు పనిచేసేవారికి రెండున్నర మార్కులు, రూరల్ కు 2 మార్కులు, అర్బన్ లో పనిచేసేవారికి ఒక మార్కు వెయిటేజ్ కింద ఇచ్చేవారన్నారు. కొవిడ్ డ్యూటీ చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం వెయిటేజ్ మార్కులను పెంచుతూ, జీవో జారీచేసిందన్నారు. 6 నెలలు పనిచేస్తే 5 మార్కులు, ఏడాది పనిచేస్తే 10 మార్కులు, ఏడాదిన్నర పనిచేస్తే 15 మార్కుల వెయిటేజ్ ఇచ్చేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పోస్టుల భర్తీ సమయంలో 100 మార్కులకు 15 మార్కులకు వెయిటేజ్ ఇచ్చేలా జీవోలో పేర్కొందన్నారు.   
 
అందరికీ వ్యాక్సిన్ వేస్తాం...
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ వేస్తామని, అందరూ ఓపికతో ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. చాలా జిల్లాల్లో జరుగుతున్న వ్యాక్సినేషన్ సందర్భంగా ఏర్పడుతున్న రద్దీని నియంత్రణకు రాష్ట్ర ప్రభుతం చర్యలు చేపట్టిందన్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో రద్దీని అడ్డుకోడానికి జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసిందన్నారు.

ప్రస్తుతం సెకండ్ డోస్ ఇస్తున్నామని, మొదటి డోస్ వేయడం లేదనే విషయాన్ని లౌడ్ స్పీకర్లు, వార్డు, గ్రామ వలంటీర్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి తెలిపాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే మొదటి డోస్ తీసుకున్నవారికి సెకండ్ డోసు ఎప్పుడు ఇస్తున్నామనే విషయాన్ని వలంటీర్లు ద్వారా, ఎస్ఎంఎస్ ల ద్వారా సమాచారమందించాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు