భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే క్రికెట్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. అలాంటి పండుగకు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరు వేదిక కానుంది. ఈ మ్యాచ్‌పై క్రికెట్ ఫ్యాన్స్, సెలెబ్రిటీలే కాదు రాజకీయ నేతలు కూడా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్‌పై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్- పాక్‌ల మధ్య అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌లు భవిష్యత్తులో కొనసాగుతాయన్నారు. అయితే భారత్ మాత్రం పాకిస్థాన్ వెళ్లి మ్యాచ్ ఆడదు. అలాగే పాకిస్థాన్ కూడా భారత్‌కు వచ్చి మ్యాచ్ ఆడే ప్రసక్తే లేదన్నారు. అయితే భారత్-పాక్ క్రికెట్ సిరీస్‌కు విదేశీ దేశాలు వేదిక అవుతాయన్నారు. తద్వారా అంతర్జాతీయ వేదికలపై ఇండో-పాక్ సిరీస్‌లు జరుగుతాయని అమిత్ షా తేల్చేశారు.
ఇదిలా ఉంటే ఇండో-పాక్ మ్యాచ్ అంటే యమా క్రేజ్ వుంటుంది. కోట్లాది మంది టీవీ స్క్రీన్లకు అతుక్కుపోతారు. అభిమానుల్లో బంతి బంతికి నరాలు తెగే ఉత్కంఠ ఉంటుంది. ఇక మ్యాచ్‌లను ప్రసారం చేసే టీవీ ఛానళ్లకైతే పండగే పండగ. దాయాదుల పోరుకు వచ్చే టీఆర్పీ రేటింగ్ ఒక రేంజ్లో ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరును ప్రసారం చేయనున్న స్టార్ స్పోర్ట్స్ యాడ్ టారిఫ్‌ను ఇతర మ్యాచ్‌ల కంటే దాదాపు పది రెట్లు అమాంతం పెంచేసింది. ఈ క్రమంలో 30 సెకండ్ల యాడ్‌కు మన కరెన్సీలో అక్షరాలా కోటి రూపాయలను వసూలు చేయబోతోంది.
మరోవైపు భారత్-పాక్ ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ పోరులో తమ తమ దేశాలు గెలవాలని క్రికెట్ ఫ్యాన్స్ ప్రార్థనలు చేసుకుంటున్నారు. భారత్ ఫ్యాన్స్ భారత్‌కే ట్రోఫీ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పాక్ ఫ్యాన్స్ కూడా అదే నమ్మకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ లీగ్ ఫైనల్స్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్‌ను ఎదుర్కోనున్న తరుణంలో పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్‌కు లెజెండరీ క్రికెటర్, పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ పలు సూచనలు చేశారు.
పాకిస్థాన్ టాస్ గెలిచిందో.. పొరపాటు కూడా భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించవద్దన్నారు. టీమిండియా బ్యాటింగ్ బలోపేతంగా ఉందని.. అందుచేత తొలుత బ్యాటింగ్ చేయనివ్వద్దొన్నారు. అలా కనుక చేస్తే.. భారత్ భారీ స్కోరు సాధిస్తుందని.. పాకిస్థాన్ ఒత్తిడికి గురవుతుందన్నారు.
పాకిస్థాన్ బలం బౌలింగ్‌లో ఉందని.. ఆ బలంతో భారత బ్యాట్స్మెన్లకు చుక్కలు చూపించాలన్నారు. లీగ్‌లో భారత్ చేతిలో ఓడిన పాకిస్థాన్.. ఫైనల్ పోరులో ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్ దొరికిందని ఎత్తిచూపారు. ఈ అవకాశాన్ని పాకిస్థాన్ సద్వినియోగం చేసుకోవాలని ఇమ్రాన్ ఖాన్ సూచించారు.