ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో భారత్‌నే విజయం వరించింది. ఫలితంగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 4-0 తేడాతో భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఒక్క మొదటి టెస్ట్ మ్యాచ్ మాత్రమే డ్రాగా ముగిసింది. మిగతా అన్ని మ్యాచ్‌లలో టీమిండియానే విజయం సాధించింది. అయితే సిరీస్ మొత్తం మీద అధికంగా 655 పరుగులు చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. ఆఖరిదైన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు ఇన్నింగ్స్ 75 పరుగులతో గెలుపొందగా 303 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన కరుణ్ నాయర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
ఈ సందర్భంగా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. జట్టులో యువకులు రాణించడం శుభపరిణామమని కొనియాడాడు. చివరి టెస్టులో ఆధిక్యంలో నిలవడంతో వికెట్లు తీయడమే లక్ష్యమని నిర్ణయించుకున్నామని చెప్పుకొచ్చాడు. రవీంద్ర జడేజా తమ కలను సాకారం చేశాడని తెలిపాడు. డ్రెస్సింగ్ రూంలో సానుకూల వాతావరణం ఆటగాళ్ల మధ్య సాన్నిహిత్యం పెంచిందని కోహ్లీ పేర్కొన్నాడు. టెస్టు విజయం పట్ల కోహ్లీ హర్షం వ్యక్తం చేశాడు. అద్భుతమైన పిచ్‌ను గ్రౌండ్స్ మన్ తయారు చేశారని, మెరుగైన జట్టే విజయం సాధించిందని కోచ్ కుంబ్లే చెప్పాడు.
చెన్నైలోని చేపాక్ స్టేడియంలో జరిగిన ఐదో టెస్టులో భారత్ జట్టు ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. ఈ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 477 పరుగులు చేసింది. దీటుగా ఆడిన భారత జట్టు కేఎల్ రాహుల్ (199), కరుణ్ నాయర్ (303) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 759 పరుగులు సాధించింది.
దీంతో 282 పరుగులు వెనుకబడ్డ ఇంగ్లండ్ జట్టు భారత విజయాన్ని అడ్డుకునేందుకు తీవ్రంగా శ్రమించింది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టుకు రవీంద్ర జడేజా చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ జట్టును కేవలం 207 పరుగులకే రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శనతో కుప్పకూల్చాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు చివరి టెస్టును ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో కోల్పోయింది. ఈ క్రమంలో ఏడు వికెట్లు పడగొట్టిన జడేజా.. ఇంగ్లండ్ కెప్టెన్ కుక్‌ను సిరీస్‌లో ఆరుసార్లు అవుట్ చేశాడు.