అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ డ్రా కోసం చివరివరకు పోరాడినా.. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (6/132) ధాటికి నిలవలేకపోయింది. తన ఓవర్‌నైట్ స్కోరు 93/4తో సోమవారం ఉదయం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 236 పరుగులకే కుప్పకూలింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యం సాధించింది. రెండో టెస్టు ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం ప్రారంభం కానుంది.
నిజానికి పిచ్ స్పిన్‌కు బాగా అనుకూలించింది. దీంతో 434 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం దాదాపు అసాధ్యం కావడంతో భారత్ విజయం లాంఛనమేనని అంతా భావించారు. కానీ కివీస్ మిడిలార్డర్ బ్యాట్స్మెన్లు లూక్ రోంచి (80: 120 బంతుల్లో 9×4, 1×6), శాంట్నర్ (71: 179 బంతుల్లో 7×4, 2×6) అర్ధశతకాలతో.. ఐదో వికెట్‌కి ఏకంగా శతక భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ శిబిరంలో చిన్నపాటి కంగారు మొదలైంది.
అయితే, స్పిన్నర్ జడేజా వూరిస్తూ విసిరిన బంతికి లూక్ రోంచి ఔటవగా.. క్రీజులో పాతుకుపోయి భారత్ బౌలర్ల సహనాన్ని పరీక్షించిన శాంట్నర్‌ను అశ్విన్ బోల్తా కొట్టించాడు. మధ్యలో వాట్లింగ్ (18), క్రెయిగ్ (1)లను పేసర్ మహ్మద్ షమీ వరుస ఓవర్లలో ఔట్ చేయడంతో కివీస్ పతనం వేగంగా జరిగిపోయింది.
ఆకరులో 3 పరుగుల వ్యవధిలోనే అశ్విన్ వరుసగా శాంట్నర్, ఇష్ సోధి (17), వాగ్నర్ (0)లను పెవిలియన్‌కు పంపడం విశేషం. కాగా భారత్ ఆడిన 500 టెస్టుల్లో ఇది 130వ విజయం. భారత్‌లో 88వ విజయం కాగా, న్యూజిలాండ్‌పై 19వ విజయం.