రెండో వన్డే మ్యాచ్ : ఆసీస్ బ్యాటింగ్.. నిలకడగా ఆడుతున్న ఓపెనర్లు
ఆదివారం, 29 నవంబరు 2020 (09:59 IST)
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా, భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ ఆదివారం సిడ్నీ క్రికెట్ మైదానంలో ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ మరో ఆలోచనకు తావులేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా, ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు 10 ఓవర్లలో 59 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్ 37, ఫించ్ 17 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
కాగా, తొలి వన్డేలో టీమిండియా చిత్తుగా ఓడిన విషయం తెల్సిందే. దీంతో ఈ మ్యాచ్‌లో తప్పక సత్తాచాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు వన్డేల సిరీస్‌ను నిలుపుకోవాలంటే ఆదివారం జరిగుతున్న మ్యాచ్‌లో అతిథ్య ఆసీస్‌పై ఖచ్చితంగా గెలువాల్సిన పరిస్థితి నెలకొంది.
జట్టులో సమతూకం లేకపోవడం సమస్యగా మారిందని కెప్టెన్ కోహ్లీ అన్నట్టే ఆల్‌రౌండర్ కొరత జట్టులో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. హార్దిక్ పాండ్య తొలి వన్డేలో బ్యాటింగ్‌లో సత్తాచాటినా.. గాయం నుంచి ఇటీవలే కోలుకున్న అతడు బౌలింగ్ చేసే పరిస్థితులు లేవు.
దీంతో ఆరో బౌలర్ అందుబాటులో లేకపోవడంతో ఉన్న బౌలింగ్ దళంపై ఒత్తిడి పెరుగుతోంది. అదనపు బ్యాట్స్‌మెన్‌ను తీసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆసీస్‌ను ఓడించాలంటే భారత టాపార్డర్ కచ్చితంగా సత్తాచాటాల్సిందే.
అయితే, ఆస్ట్రేలియాపై పైచేయి సాధించాలంటే ఆ జట్టు టాపార్డర్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్, కెప్టెన్ ఫించ్, స్టీవ్ స్మిత్ త్రయాన్ని బుమ్రా నేతృత్వంలోని పేస్ దళం త్వరగా పెవిలియన్‌కు పంపాలి. ఒకవేళ వీరు కుదురుకుంటే తొలి వన్డేలా పరుగుల వరద పారించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
మరోవైపు భారత యువ పేసర్ నవ్‌దీప్ సైనీ, స్టార్ స్పిన్నర్ చాహల్ ఫిట్‌నెస్‌పై అనుమానాలు నెలకొన్నాయి. తొలి వన్డేలో ఈ ఇద్దరు 20 ఓవర్లలో 172 పరుగులు సమర్పించుకున్నారు. మరోవైపు సన్‌రైజర్స్ యార్కర్ స్పెషలిస్టు నటరాజన్ వన్డేలకు కవర్ బౌలర్‌గా వచ్చాడు. ఒకవేళ చాహల్ కూడా ఆడలేకుంటే కుల్దీప్ యాదవ్ లేదా బ్యాటింగ్ కూడా చేయగల పేసర్ శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
తొలి వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత జట్టుకు మ్యాచ్ ఫీజులో 20 శాతం కోతపడింది. నిర్ణీత సమయంలో 50 ఓవర్లు పూర్తి చేయకపోవడంతో ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్.. కోహ్లీసేనకు జరిమానా విధించారు. అలాగే ఇది సుదీర్ఘంగా సాగిన వన్డే అంటూ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.