స్వేచ్ఛగా వదిలేసే కోచ్‌ని కోరుకుంటున్నారా.. జట్టు చంకనాకిపోతుందన్న గవాస్కర్

గురువారం, 29 జూన్ 2017 (02:10 IST)
టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లేని అత్యంత అవమానకరంగా సాగనంపిన తీరుపై తొలి నుంచి ధ్వజమెత్తుతున్న ఏకైక వెటరన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రమే. కేప్టెన్ ఇష్టపడకపోతే కోచ్‌ను సాగనంపడం కంటే ఘోరమైన విషయం లేదని గతంలోనే గవాస్కర్ విరుచుకుపడిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి కుంబ్లే ఘటనపై తీవ్రంగా స్పందిచాడు. భారత్ ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి అనిల్ కుంబ్లే తప్పుకున్న విధానం చూసిన తర్వాత క్రికెట్ దిగ్గజాలు ఎవరూ ఆ స్థానం కోసం ఆశించరని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం కోచ్ పదవికి కుంబ్లే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కోచింగ్ స్టైల్‌పై కెప్టెన్ విరాట్ కోహ్లికి అభ్యంతరాలు ఉండటంతోనే తాను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు కుంబ్లే సుదీర్ఘ లేఖ ద్వారా వెల్లడించాడు.
 
"హుందాతనానికి ప్రతిరూపమైన అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లికి మధ్య తలెత్తిన విభేదాలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. కనీసం దిగ్గజ క్రికెటర్‌ అనే గౌరవం కూడా కోహ్లి ఇవ్వకపోవడం బాధాకరం. కుంబ్లేకి జరిగిన అవమానం చూసిన తర్వాత ఏ దిగ్గజ క్రికెటర్ కూడా కోచ్ పదవిని చేపట్టాలని భావించడు. భారత్ క్రికెటర్లు తమ ప్రాక్టీస్, లోపాలను ఎత్తిచూపకుండా స్వేచ్ఛగా వదిలేసే కోచ్‌ని కోరుకుంటున్నారు. అలా అయితే జట్టుకి మెరుగైన ఫలితాలు ఎలా వస్తాయి" అని గవాస్కర్ ప్రశ్నించాడు.
 
ప్రస్తుతం కోచ్ రేసులో రవిశాస్త్రి, టామ్ మూడీ, సెహ్వాగ్ పేర్లు వినిపిస్తున్నా.. కోహ్లితో పాటు ఆటగాళ్లందరూ రవిశాస్త్రి కోచ్‌గా రావాలని కోరుకుంటున్నారు. దీంతో బీసీసీఐ కూడా అతనివైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. సచిన్ టెండూల్కర్ సైతం రవిశాస్త్రివైపే మొగ్గు చూపడంతోపాటు ప్రోత్సహించి అతడిచే దరఖాస్తు దాఖలు చేయమనడంతో ఇక రవిశాస్త్రి కోచ్ కావడం నామ్ కే వాస్తే అంటున్నారు.
 

వెబ్దునియా పై చదవండి