ఓవల్ టెస్ట్ : ఇంగ్లండ్ బ్యాటింగ్ అదుర్స్.. ఓటమి దిశగా భారత్!

ఆదివారం, 17 ఆగస్టు 2014 (12:00 IST)
తొలిరోజు భారత ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టిన ఓవల్‌ మైదానంలో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ అదరగొట్టారు..! మనోళ్లు తలో 50 బంతులైనా ఎదుర్కోలేక తడబడిన పిచ్‌పై ఇంగ్లండ్ ఆటగాళ్లు అర్థ శతకాలతో చెలరేగారు. ధోనీ గ్యాంగ్‌ అంతా కలిసి 150 పరుగులైనా సాధించలేని వేదికపై ఇప్పటికే అంతకు రెండింతలకు పైగా స్కోరు చేసి రెండో రోజే మ్యాచ్‌పై పట్టు బిగించారు. ఓ దశలో ఇంగ్లండ్‌ను 229/5తో ఒత్తిడిలోకి నెట్టి కాస్త ఆశలు రేకెత్తించిన బౌలర్లు.. అనంతరం పట్టు కోల్పోయి... ప్రత్యర్థి జట్టుకు ఆధిక్యాన్ని సమర్పించుకున్నారు. ఫలితంగా ధోనీ సేన ఐదో టెస్ట్ మ్యాచ్‌లోనూ ఓటమి దిశగా పయనిస్తోంది. 
 
ఓవల్ వేదికగా జరుగుతున్న చివరి టెస్ట్ రెండో రోజున ఓవర్‌నైట్‌ స్కోరు 62/0తో శనివారం ఆటకొనసాగించిన ఇంగ్లండ్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్లకు 385 పరుగులు చేసింది. జో రూట్‌ (91 బ్యాటింగ్‌)కు తోడు, కెప్టెన్‌ కుక్‌ (79), బ్యాలెన్స్‌ (64) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో కుక్‌సేనకు ఇప్పటికే 237 పరుగుల ఆధిక్యం లభించింది. రూట్‌తో పాటు జోర్డాన్‌ (19 నాటౌట్‌) క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లలో ఇషాంత్‌, ఆరోన్‌, అశ్విన్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 148 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి