భారత క్రికెట్ జట్టు కోచ్‌గా గ్యారీ కిర్‌స్టన్ నియామకం

బుధవారం, 5 డిశెంబరు 2007 (14:32 IST)
భారత క్రికెట్ జట్టు కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్‌స్టన్‌‌ను నియమించారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శి నిరంజన్ షా బుధవారం ఒక పత్రికా ప్రకటనలో నిర్థారించారు. వచ్చే ఏడాది మార్చి నెల ఒకటో తేదీ నుంచి పూర్తిస్థాయి కోచ్‌గా బాధ్యతలు చేపట్టే గ్యారీ రెండేళ్ల పాటు.. ఆ పదవిలో కొనసాగుతాడని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుండగా..'టీమ్ ఇండియా కోచ్‌'గా నియామకం పట్ల గ్యారీ కేప్‌టౌన్‌లో స్పందిస్తూ.. భారత జట్టుకు క్రికెట్ కోచ్‌గా ఎన్నిక కావడం ఒక గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పాడు.

ఇదో గొప్ప గౌవరం. మిగిలిన నా క్రికెట్ జీవితానికి ఇది అతిపెద్ద ఛాలెంజ్ అని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత జట్టు తరపున వెళ్లకపోయినప్పటికీ.. ఆ జట్టు ఆడే మూడు, నాలుగు టెస్ట్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటానని గ్యారీ అన్నాడు. అలాగే.. ఈనెల 17వ తేదీన భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళుతుందని. ఈమధ్యలోనే 'టీమ్ ఇండియా' సభ్యులను కలుసుకోనున్నట్టు చెప్పారు.

అయితే.. సొంతగడ్డపై దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య జరిగే టెస్ట్, వన్డే సిరీస్‌లు గ్యారీకి అత్యంత కీలకం కానున్నాయి. ఈ సిరీస్ వచ్చే మార్చి-ఏప్రిల్ నెలలో ప్రారంభంకానుంది. ఈ 40 ఏళ్ల దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ 101 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.

వెబ్దునియా పై చదవండి