సాక్షి వర్సెస్ అదర్ మీడియాస్.. ఈ మీడియా వార్ ఎంతవరకు వెళుతుంది..?!!

గురువారం, 21 జూన్ 2012 (20:16 IST)
FILE
జగన్ ఆస్తుల వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలని హైకోర్టు సీబీఐని ఆదేశించిన దగ్గర్నుంచి మీడియా పలు వర్గాలుగా చీలిపోయిందని స్పష్టంగా అర్థమవుతోంది. ఆయా మీడియాల్లో జగన్‌కు వ్యతిరేకంగా, అనుకూలంగా కథనాలు పుంఖాను పుంఖాలుగా వస్తూనే ఉన్నాయి. ఏ వార్త నిజం అనేది తర్వాతి సంగతి. కానీ ఇప్పుడు ఈ మీడియా వార్ పరాకాష్టకు చేరినట్లు అగుపిస్తోంది.

ఇప్పటివరకూ రాజకీయ నాయకులు ఒకరికొకరు కుమ్మక్కయ్యారంటూ ఒకరిపై ఒకరు ధ్వజమెత్తుకున్న నాయకులు ఇప్పుడు మీడియా వైపుకు వచ్చేశారు. ఎల్లో మీడియా అంటూ కొన్ని పత్రికలను సాక్షి ఉటంకిస్తుంటే... తప్పులను, అవినీతిని వెనకేసుకొస్తున్న పత్రిక సాక్షి అని మరికొన్ని పత్రికలు తూర్పారపడుతున్నాయి.

చిట్టచివరికి జగన్ ఆస్తుల కేసు తీరుతెన్నులను సీబీఐ జేడీ ఇతర పత్రికలు, ఛానళ్ల క్రైం రిపోర్టర్లతో.. సాక్షి రిపోర్టర్లతో కాకుండా సమాచారాన్ని చేరవేస్తున్నారని వైకాపా నాయకులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఆయా పత్రికల రిపోర్టర్లతో జేడీ సంభాషించారంటూ వారి ఫోను నెంబర్లను సైతం వెల్లడించారు. దీంతో ఆయా ఛానళ్ల రిపోర్టర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ వృత్తి ధర్మంలో భాగంగా ఏ అధికారితోనైనా ఎన్నిసార్లయినా మాట్లాడుతామని చెప్పారు. సాక్షి తన నెంబర్లను ప్రచురించడం వల్ల బెదిరింపు కాల్స్ వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.

మొత్తమ్మీద జగన్ అక్రమాస్తుల కేసు రాజకీయ లోకం నుంచి సీబీఐ అధికాలపైకి.. అటు నుంచి ఇప్పుడు మీడియాలోని పలు ఛానళ్ల పైకి దూసుకొచ్చింది. ఈ వ్యవహారంలో రాష్ట్రంలోని మీడియాలోని పలు పత్రికలు - ఛానళ్ల మధ్య వార్ నడుస్తోంది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో వెయిట్ అండ్ సీ.

వెబ్దునియా పై చదవండి