కెటిఆర్ ఆటలో ఈటెల పరిస్థితి ఏంటో? అది నిజమేనా?

శనివారం, 1 మే 2021 (17:04 IST)
ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో కరోనా కేసుల కన్నా ఈటెల రాజేందర్ వ్యవహారమే హాట్ టాపిక్‌గా మారుతోంది. తెలంగాణా రాష్ట్ర సమితి ఏర్పడినప్పటి నుంచి కెసిఆర్‌తో సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు ఈటెల రాజేందర్. అందుకే ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రినే చేశారు కెసిఆర్.
 
సరిగ్గా నిన్నటి వరకు ఈటెల రాజేందర్ వైద్య, ఆరోగ్య శాఖామంత్రిగా ఉన్నారు. కరోనా కేసులను కట్టడి చేయడంతో ఆయన బాగా పనిచేశారంటూ ప్రజల నుంచి ప్రసంశలు వచ్చాయి. ఇది బాగానే ఉన్నా అసలు విషయం.. అంతకుముందు ప్రభుత్వంపైనే విమర్సలు చేస్తూ పలు సభల్లో ఈటెల రాజేందర్ మాట్లాడటమే కెసిఆర్ కుటుంబానికి కోపం తెప్పించిందట.
 
ముఖ్యంగా కెసిఆర్‌కు కాదు ఆయన కుమారుడు కెటిఆర్‌కు బాగా కోపమొచ్చిందట. ఒక మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ తమ ప్రభుత్వంపైనే విమర్సలు చేయడాన్ని కెటిఆర్ అస్సలు జీర్ణించుకోలేకపోయారట. అయితే దానికి సమయం కోసం వేచి చూస్తూ వచ్చారట. అంతేకాదు కెసిఆర్‌తో స్వయంగా మాట్లాడి ఈటెలను పూర్తిగా పక్కకు పెట్టాలన్న నిర్ణయానికి వచ్చేశారట.
 
కానీ ఇంతలో తెలంగాణా రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండడంతో పాటు ఈటెల రాజేందర్ ప్రజలకు దగ్గరవ్వడం.. ఎప్పటికప్పుడు కరోనాపై వైద్యాధికారులతో సమావేశం నిర్వహించడం లాంటివి చేస్తూ తన పనిని తాను సమర్థవంతంగా చేస్తున్నారట. దీంతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారనే టాక్ వస్తోంది. 
 
ఈ నేపధ్యంలో ఈటెల రాజేందర్ భూ వ్యవహారంలో ఇరుక్కున్నారు. అందులో ప్రధాన పాత్రధారి, సూత్రధారి కెటిఆరేనట. 2016 సంవత్సరంలో మాసాయిపేటలో అచ్చంపేట గ్రామంలో భూకొనుగోలు వ్యవహారం ఇప్పుడు ఈటెల వ్యవహారంలో పెద్ద తలనొప్పిగా మారింది.
 
హేచరీస్ కోసం అప్పట్లో 100 కోట్లు అప్పులు తీసుకోవడమే కాదు.. స్థలాన్ని కబ్జా కూడా చేశాడని ఆరోపణలున్నాయి. ఈ కేసును మళ్ళీ తిరగదోడటమే కాకుండా వెంటనే కెసిఆర్ విచారణకు ఆదేశించారు. అంతటితో ఆగలేదు... వైద్య, ఆరోగ్య శాఖ పదవిని ఈటెల నుంచి తీసేసుకున్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా ఇప్పుడు ఆ పదవిని చూడబోతున్నారు. 
 
కెసిఆర్ అనారోగ్యంతో ఉండడంతో పాటు కెటిఆర్ కూడా ప్రస్తుతం కోవిడ్ పాజిటివ్‌తో ఉన్నారు. కానీ ఇలాంటి సమయంలో పార్టీ కార్యకర్తల నుంచి వ్యతిరేకత రాకూడదని ఇప్పుడే ఈటెలకు స్కెచ్ వేశారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కెటిఆర్ దర్సకత్వంలోనే ఈటెల రాజేందర్ కథ మొత్తం సాగుతుందన్నది విశ్లేషకుల భావన. మరి చూడాలి కెటిఆర్ ఆటలో ఈటెల పరిస్థితి ఏంటన్నది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు