తెలుగు భాష దినోత్సవం... తెలుగు భాషాభివృద్ధిపై చొరవ చూపని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

సోమవారం, 29 ఆగస్టు 2016 (15:11 IST)
వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం పరిపాటి. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణా వేరుపడిన తరువాత తెలంగాణా వారు కాళోజీ జన్మదినోత్సవాన్ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. విభజనానంతరం ఆంధ్రప్రదేశ్ తెలుగు విశ్వవిద్యాలయాన్ని, తెలుగు అకాడమీని కోల్పోయింది. సమైక్య రాష్ట్రంగా ఉన్న రోజుల్లోనే తెలుగు భాష తమ ప్రభావాన్ని క్రమక్రమంగా కోల్పోవడం మొదలైయింది. పాలకుల నిర్లక్ష్యధోరణే ఇందుకు ప్రధాన కారణం. 
 
నందమూరి తారకరామరావు, పి.వి. నరసింహారావు లాంటి ఒకరిద్దరూ ముఖ్యమంత్రులు తప్ప తెలుగు భాషను ప్రోత్సహించడానికి ఏ ముఖ్యమంత్రి చొరవ తీసుకోకపోవడం తెలుగు వారి దురదృష్టకరం. విభజనానంతరం కూడా ఉభయ రాష్ట్రాలలోని తెలుగు ప్రభుత్వాలు మాతృభాష పట్ల ఉదాసీన వైఖరిని అవలంభిస్తున్నాయి. గత సంవత్సరం తెలుగు భాషా దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త రాష్ట్రంలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తామని, ఇంటర్మీడియట్ స్థాయిలో తప్పనిసరిగా ద్వితీయ భాషగా తెలుగునే చదవాలనీ ఆర్డినన్స్ తెస్తామని అన్నారు.
 
సంవత్సరం గడుస్తున్నా ఒక్క అడుగు కూడా ముందుకు వేసిన దాఖలాలు లేవు. అట్లే ఆ సభలో చంద్రబాబు తెలుగు భాషా సంఘం అధ్యక్షునిగా పొట్లూరి హరికృష్ణను నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఇంతవరకు ఆ అధ్యక్షుడు పత్రికల్లో ఒక్క ప్రకటన చేసిన పాపాన పోలేదు. తెలుగు భాష సంఘం ప్రభుత్వం తరుపున ఒక్క కార్యక్రమం నిర్వహించలేదు. 
 
తెలుగు ప్రాచీన హోదా కల్పించడాన్ని సవాల్‌ చేస్తూ 2009లో మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. విభజనానంతరం కోర్టులో జరిగిన వాదనల్లోనూ తెలంగాణా ప్రభుత్వం చూపినంత చొరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ చూపలేదనే విమర్శలు ఉన్నాయి. ఎట్టకేలకు తెలుగు ప్రాచీన భాషా హోదా కల్పించారని స్పష్టం చేస్తూ మద్రాసు హైకోర్టు పిల్‌ను కొట్టివేసింది. గతంలో తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని విద్యార్థులు అక్కడి భాషలోనే పరీక్షలు రాయాలనీ తీర్మినించినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపినంత చొరవ తెలంగాణా ప్రభుత్వం చూపలేదనే విమర్శ ఉంది. ఏది ఏమైనా ఉభయ తెలుగు రాష్ట్రాలు తెలుగు భాషాభివృద్ధిపై చొరవ చూపాలి. 
 
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక కేంద్రం గానే గాకుండా భాషా సాంస్కృతిక కూడలిగా రాజధానిని నిర్మించే విషయంలో అడుగులు వేయాలి. తెలుగు అకాడమీ స్థాపనకు, తెలుగు విశ్వవిద్యాలయ స్థాపనకు త్వరితగతిన అడుగులు వేయాలి. ఇంటర్మీడియట్ స్థాయిలో తెలుగు భాషకు తగు ప్రాధాన్యతను ఇవ్వాలి. ప్రైవేటు – కార్పొరేట్ విద్యాసంస్థల ఒత్తుడులకు తలవంచకుండా రానున్న రోజుల్లోనైనా మాతృభాష పురోభివృద్ధి వైపుకు ప్రభుత్వం అడుగులు వేయాలని మనసారా ఆశిద్దాం.

వెబ్దునియా పై చదవండి