"వాల్ పోస్టర్" ఆడియో విడుదల

ఏ ఉత్పత్తిరంగంలోనైనా తమ వస్తువు నలుగురికి తెలియాలంటే ముందుగా తెలిసేది వాల్‌పోస్టర్ ద్వారానే. ఇక సినిమారంగానికి ఈ వాల్‌పోస్టర్‌కు అవినాభావ సంబంధం ఉందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చూడడానికి ఆకర్షణీయంగా ఉండే ఆ వాల్‌పోస్టర్ వెనుక ఎంతోమంది శ్రమ దాగి ఉంది.

ఈ నేపథ్యాన్ని కథగా ఎంచుకుని స్నేహారెడ్డి క్రియేషన్స్ పతాకంపై "వాల్‌పోస్టర్" చిత్రం రూపొందుతోంది. మన్మోహన్, మధుశర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి విజయ్ దర్శకత్వం వహించారు. వెంకట్‌రెడ్డి నిర్మించారు. లారెన్స్ దాసరి ఈ చిత్రానికి బాణీలు సమకూర్చారు. భాస్కరభట్ల, వేణు చింతలపాటి, కలువకృష్ణసాయి రాసిన పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి.

ముఖ్య అతిథి ప్రముఖ దర్శకుడు వి. సముద్ర ఆడియో కేసెట్‌ను ఆవిష్కరించగా మరో దర్శకుడు శ్రీనివాసరెడ్డి అందుకున్నారు. అనంతరం సీడీని చిత్ర సంగీత దర్శకుడు లారెన్స్ దాసరి విడుదల చేసి చిత్ర సమర్పకురాలు లీలావతికి అందజేశారు. సినిమా ప్రచారానికి ప్రథమ మెట్టయిన వాల్‌పోస్టర్ అనే టైటిల్‌తో చిత్రాన్ని నిర్మిస్తున్న చిత్ర యూనిట్‌ను సముద్ర అభినందించారు.

మధుశర్మ గతంలో తాను రూపొందించిన "అదిరిందయ్యా చంద్రం"లో ప్రముఖ పాత్ర పోషించిందని మంచి నటి అని సముద్ర కొనియాడారు. చిత్ర హీరో మన్మోహన్ డాన్స్ బాగా చేశాడని, పాటలతోపాటు సినిమా కూడా విజయవంతం కావాలని శ్రీనివాస రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇకపోతే... చిత్ర దర్శకుడు వాల్‌పోస్టర్ నేపథ్యాన్ని ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో వివరించారు. తాను కొత్తవాడయినప్పటికీ అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. కథ నచ్చి తాము తొలిసారిగా నిర్మాణ రంగంలో అడుగెట్టామని వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి