ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో వైకాపాకు చెందిన ప్రతిపక్ష సభ్యులు లేకపోయినప్పటికీ సభా కార్యక్రమాలు మాత్రం వాడివేడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా, టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులు సంధించే ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు సమాధానాలు చెబుతున్నారు.
అయితే, శుక్రవారం జరిగిన సమావేశాల్లో మాత్రం ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ, ఏదైనా పనిమీద వెళ్లితే ఉప ముఖ్యమంత్రి చేయొద్దంటున్నారంటూ అధికారులే సమాధానం చెబుతున్నారని, డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి నేరుగా ఫోను చేసి చెప్పాలని ఏకంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ స్వయంగా చెప్పారన్నారు.
ఈ వ్యాఖ్యలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘాటుగా సమాధానమిచ్చారు. బోండా ఉమామహేశ్వర రావు తమ మాటలను సరిదిద్దుకోవాలని సూచించారు. పొల్యూషన్ బోర్డు అందుబాటులో ఉండదు అని చెప్పడం ఏమాత్రం సబబు కాదన్నారు. రాంకీ సంస్థపై చర్యలు తీసుకున్నామని, ఇందులోభాగంగానే షోకాజ్ నోటీసులు కూడా జారీచేశామన్నారు.