ఆడియో కంపెనీలపై పడి ఏడుస్తారెందుకు?

ఈమధ్య చాలా ఆడియో ఫంక్షన్లలో ఆడియో కంపెనీలు సరిగ్గా అమ్మకాలు జరపడం లేదనీ, ఆడియో విడుదల తర్వాత ఎవరికివారు చేతులు దులుపుకుంటున్నారనీ నిర్మాతకు దానివల్ల నష్టం వాటిల్లుతున్నదని దాసరి నారాయణరావు ధ్వజమెత్తారు. దానికి కౌంటర్‌గా ఆడియో కంపెనీకి చెందిన మధుర ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత శ్రీధర్ ఘాటుగా స్పందించారు.

"మనమంతా 6వ తరగతిలోనే డిమాండ్- సప్లయిల గురించి చదువుకున్నాం. సినిమా రంగమే కాదు ఏ రంగంలోనైనా ఈ సూత్రం వర్తిస్తుంది. ఆడియో అమ్మకాలు ఒక్కోచోట బాగా జరుగుతాయి. ఒక్కోచోట జరగవు. అక్కడకు మేం వెళ్లి ఆడియో క్యాసెట్లు వేసి డబ్బులు పోగోట్టుకోలేం. ముందుగా నిర్మాతలంతా సినిమా బాగా చేద్దాం అని ఆలోచించాలి. సినిమా బాగుంటే ఆడియో ఎక్కడికైనా వెళుతుంది.

మేమేదో అమ్మకాలు సరిగ్గా చేయడం లేదని అనడం సరైంది కాదు. అసలు ఆడియో కంపెనీలపై ఏడుస్తారెందుకు? ముందు సినిమాలు బాగా తీయండి. లక్షలు పెట్టి ఆడియో వ్యాపారం చేసేది మీలాంటివారిచేత మాటలు పడేందుకు కాదు. నిర్మాతలు కాళ్లు పట్టుకుని మా కంపెనీకి ఆడియో ఇవ్వండని మేమేమీ అడగటం లేదుగా" అని ధ్వజమెత్తారు.

దీంతో అక్కడే ఉన్న సి. కల్యాణ్ ఆయనపై ఎదురు దాడి చేశారు. "మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే తర్వాత ప్రెస్‌మీట్ పెట్టుకోండ"ని మందలించారు. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇదంతా పోసాని చిత్రం జెంటిల్‌మెన్ ఆడియోలో జరిగింది.

వెబ్దునియా పై చదవండి