కేరళ దేశాన్ని మహాబలి చ క్రవర్తి పరిపాలించినట్టు పురాణాలు సూచిస్తుండగా, ప్రతి సంవత్సరం ఆయన తమను పలకరించేందుకు వస్తాడని నమ్మి, ఎదురు చూసే రోజునే ఓనం పండుగగా కేరళీయులు జరుపుకుంటున్నారు. తిరుమరై అడవుల్లో వెలిసిన తిరుమాల్ గర్భగుడిలోని దీపం ఆరిపోయే సూచనలున్న సమయంలో ఓ ఎలుక అటువైపు వెళుతూ ఆ దీపంలో ఉన్న వత్తిని తనకు తెలియకుండానే కదిలించడంతో ఆరిపోబోయిన దీపం ప్రకాశవంతంగా వెలుగొందింది.
ఈ పుణ్యఫలితంగా ఆ ఎలుక తర్వాతి జన్మలో ప్రహ్లాద ఆళ్వారుని మనుమనిగా అవతరించి విశ్వమంతా పూజించే మహాబలి చక్రవర్తిగా రాణించాడని పురాణం చెబుతోంది. తెలియక చేసిన మంచిపని ద్వారా దైవకృపకు పాత్రుడైన బలిచక్రవర్తి తన ప్రజలను కరవుకాటకాల బారిన పడకుండా కంటికి రెప్పలా కాపాడాడని, ప్రజల ఆరాధ్య దైవంగా కొలవడంతో బలిచక్రవర్తి అహంకారం పెరిగిందని పురాణంలో ఉంది. తనకు మించిన ధర్మాత్ముడు, దైవం లోకంలో ఎవరూ లేరని బలిచక్రవర్తి విరవ్రీగాడు. అతని గర్వాన్ని అణగదొక్కేందుకు భగవంతుడు వామన అవతారం ఎత్తడం, బలికి విశ్వరూప దర్శనమిచ్చిన వాధానం, మూడో అడుగుగా బలి శిరస్సుపై తన పాదం మోపి వరమిచ్చిన సంగతులు గుర్తుచేసుకుంటూ ఓనం పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు.
పండుగరోజున తాను పొందిన కొత్త అవతారంతో కంటి రెప్పల్లా కాచిన ప్రజలను పలకరించడానికి బలిచక్రవర్తి భువికి దిగివస్తారని కేరళీయుల నమ్మకం. కులశేఖర పెరుమాల్ హయాంలో నెలరోజుల పాటు కోలాహలంగా ఓనం పండుగను జరుపుకున్నట్టు చరిత్ర సంఘటనలు చెబుతున్నాయి. ప్రస్తుతం నాలుగురోజుల నుండి పది రోజులపాటు ఓనం పండుగను జరుపుకుంటున్నారు. కేరళకు మాత్రం పరిమితమైన ఈ పండుగ ప్రస్తుతం పొరుగు రాషా్టల్ల్రో కూడా జరుపుకుంటున్నారు. మత సామరస్యం పెంపొందించే విధంగా అన్ని మతాల వారు ఐక్యతగా జరుపుకుంటున్న ఓనం విదేశాలకు కూడా పాకింది. ఇళ్లను, వ్యాపార సంస్థలను శుభ్రపరచుకుని, అందంగా అలంకరించి, రకరకాల పూలతో రంగవల్లులు వేస్తారు. అప్పుడే బలిచక్రవర్తి తమ ఇంటికి వస్తాడని, ఆయనను ఆహ్వానించేందుకు వేస్తున్న రంగవల్లులకు పేదలు కూడా ఖర్చు గురించి వెనుకాడరు.
ఓనం పండుగనాడు మహా బలిచక్రవర్తి ఆయనకు పునర్జన్మ ప్రసాదించిన శివపరమాత్మునికి, వరమిచ్చిన వామనుడు, పరశురాములకు పూజలు చేస్తే సకలపాపాలు తొలిగిపోతాయన్న నమ్మకంతో పండుగను అందరూ కలిసి జరుపుకుంటారు. హిందువులు మాత్రమే కాక మహమ్మదీయులు, క్రైస్తవులు, బుద్దుని కొలిచేవారు కూడా సెప్టెంబర్ 15న ఓనం పండుగను జరుపుకుని మతసామరస్యం పెంపొందింపచేస్తున్నారు.