ముక్కోటి ఏకాదశి జనవరి 13 గురువారం నాడు వచ్చింది. ఈ ఏకాదశి గురువారం అంతా వుంటుంది. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనంతో జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని, పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఏడాది మొత్తంలో వచ్చే 24 ఏకాదశిల్లో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశేషమైన ఫలితాలను ఇస్తుంది.
అలాగే ముక్కోటి రోజున శ్రీమన్నారాయణుడికి దీపారాధన చేస్తే ఉత్తమ ఫలితాలు చేకూరుతుంది. ఈ రోజున చేసే పూజలు, దానాల వల్ల ఏడాదిలో ప్రతి ఏకాదశికి చేసినంత పుణ్యం దక్కుతుంది. ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో సకల అలంకరణలు చేసుకొని ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనం ఇస్తారు.
అలాగే ఏకాదశికి ముందు రోజు ఒంటి పూట భోజనం చేయాలి. ఏకాదశి రోజున పండ్లు, ధాన్యాలు, పాలు తీసుకోవచ్చు. ఈ ఏకాదశి ఇంద్రియాలనూ ఆ హరికి అర్పించే అరుదైన అవకాశమే ఏకాదశి వ్రతం. ఇందుకోసం ముందురోజు రాత్రి నుంచే ఉపవాసం ఉండి, ఏకాదశి రోజున కేవలం తులసి తీర్థాన్నే స్వీకరిస్తూ, మర్నాడు ఉదయం ఎవరికన్నా అన్నదానం చేసిన తర్వాత భుజించాలి.
ఏకాదశి రోజున రాత్రి భగవన్నామస్మరణతో జాగరణ చేయాలి. ఇలా జాగరణతో మనసునీ, ఉపవాసంతో శరీరాన్ని నిగ్రహించుకుని.. వాటిని హరిధ్యానంలోకి మరల్చడే ఏకాదశి వ్రత ఉద్దేశం. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే ఏడాదిలోని అన్ని ఏకదాశులలోను ఉపవాసం వున్నట్లు లెక్క. ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి తులసి నీటిని మాత్రమే సేవిస్తూ గడుపుతారు.