భారత దేశపు తొలి మహిళా ఐపీఎస్ అధికారిణిగా, ఉక్కుమహిళగా అందరిచేత ప్రశంసలు అందుకున్న వ్యక్తి కిరణ్ బేడీ. పోలీసు శాఖలో ఆమె సాధించిన విజయాలకు ప్రతిరూపంగా ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. తన కెరీర్‌లోని ఒడిదుడుకులను అవలీలగా ఎదుర్కొన్న ఈమె... సమాజ శ్రేయస్సుకు చేసిన కృషికి, అత్యున్నత సేవలకుగానూ దేశంలోనేగాక అంతర్జాతీయంగా కూడా ఎన్నో కీర్తి ప్రతిష్టలను గడించారు.
"ప్రపంచంలో అన్నింటింకే మనకు ముఖ్యమైనది.. మనల్ని మనం నిరూపించుకోవడమే..!" అంటూ తన వ్యక్తిత్వానికి అద్దంపట్టేలా ఆమె చెప్పిన మాటలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమే. ఈమె మొట్టమొదటి మహిళా ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన రోజుగా.. చరిత్రలో జూలై 15కు ఓ ప్రత్యేకతను ఆపాదించి పెట్టింది కూడా...!
కిరణ్ బేడీ "క్రేన్ బేడీ"గా...!
ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ కమీషనర్‌గా ఉన్నప్పుడు రోడ్లపై ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే కార్లను క్రేన్లతో పారద్రోలి "క్రేన్‌బేడీ"గా కూడా ఈమె ప్రసిద్ధి చెందారు. తీహార్ జైలులో పలు సంస్కరణలు ప్రవేశపెట్టి అందరి మన్నలను పొందారు...
ఓషో ధ్యాన పద్ధతులను తీహార్ వంటి జైల్లోని నేరస్తులపై అవలంభింపజేసి, పరివర్తనా దిశగా అడుగులు వేయించిన ఘనత కిరణ్ బేడీకి దక్కుతుంది. ఐఏఏస్ కావాలనున్న ఈమె, ఐపీఎస్‌కు ఎంపికై భారత పోలీసు వ్యవస్థకు తన చిరస్మరణీయమైన సేవలను అందించారు.
కిరణ్ బేడీ జీవిత విశేషాల్లోకి అలా తొంగిచూస్తే... పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ జూన్ 9, 1949వ సంవత్సరంలో జన్మించారు. నలుగురు అమ్మాయిలలో రెండవ కూతురైన కిరణ్‌బేడీ డిగ్రీదాకా అమృత్‌సర్‌లోనే చదువుకున్నారు. 1968-70లో రాజనీతి శాస్త్రంలో పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగర్ నుంచి ఎం.ఏ. పట్టా పొందారు.
ఈమె ఉద్యోగంలో చేరిన తరువాత 1988లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు. 1993లో ఢిల్లీ ఐ.ఐ.టి. బేడీకి పి.హెచ్.డి. పట్టాను ప్రదానం చేసింది. కిరణ్ బేడీ చిన్న వయస్సులో మంచి క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు. గతంలో అఖిల భారత టెన్నిస్ టైటిల్‌ను, ఆల్ ఏషియన్ టెన్నిస్ టైటిల్‌ను గెలుపొందారు. తన 22 ఏళ్ళ వయసులో ఏషియా మహిళల టైటిల్‌ను కూడా కైవసం చేసుకున్నారు.
కిరణ్ బేడీ అమృత్‌సర్‌లోని ఖాల్సా మహిళల కళాశాలలో రాజనీతి శాస్త్రంలో ఉపన్యాసకురాలిగా (లెక్చరర్) జీవితం ప్రారంభించారు. 1972, జూలై 15వ తేదీన ఆమె ఇండియన్ పోలీస్ సర్వీసుకు ఎంపికయ్యారు. ఢిల్లీలో ట్రాఫిక్ పోలీస్ కమీషనర్‌గా, మిజోరాంలో డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా, చంఢీగర్ లెప్టినెంట్ గవర్నర్ సలహాదారుగా, ఐక్యరాజ్య సమితిలోను పలు కొలువుల్లో పనిచేశారు.
ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ కమీషనర్‌గా ఉన్నప్పుడు రోడ్లపై ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే కార్లను క్రేన్లతో పారద్రోలి "క్రేన్‌బేడీ"గా కూడా ఈమె ప్రసిద్ధి చెందారు. తీహార్ జైలులో పలు సంస్కరణలు ప్రవేశపెట్టి అందరి మన్నలను పొందారు. వాటి ఫలితంగా ప్రభుత్వ సర్వీసు రంగంలో "రామన్ మెగ్సస్సేసె" అవార్డును పొందారు.
అలాగే... 1979లో రాష్ట్రపతి గ్యాలెంటరీ అవార్డు, 1980లో విమెన్ ఆప్ ది ఇయర్ అవార్డు, 1991లో మత్తుపదార్థాల నివారణ మరియు నిర్మూలన వారి ఆసియా స్థాయి అవార్డు, 1994లో మెగ్సేసే అవార్డు, 1995లో మహిళా శిరోమణి అవార్డు, 1995లో లయన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, 1999లో ప్రైడ్ ఆప్ ఇండియా అవార్డు, 2005లో సాంఘిక న్యాయం అంశంలో మదర్ థెరీసా జాతీయ స్మారక అవార్డు... లాంటి పలు అవార్డులు కిరణ్‌బేడీని వరించాయి.
ఇక చివరగా... "బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్" డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తూ, డిసెంబర్ 2007వ సంవత్సరంలో కిరణ్ బేడీ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు.