యాంటీ ఏజింగ్ క్రీమ్‌లతో పని లేదు. ఫేస్ లిఫ్టింగ్ సర్జరీల అవసరం అంతకన్నా లేదు. జస్ట్ 30 నివిషాలపాటు ఫేస్ యోగా చేస్తే చాలు... నవయవ్వవన ముఖారవిందం సొంతమవుతుందంటున్నారు నార్త్‌వెస్ట్రన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు. పెరిగే వయసుతోపాటు కనిపించే వృద్ధాప్య లక్షణాలను పూర్తిగా నివారించలేకపోయినా, వాటిని కొంతకాలంపాటు వాయిదా వేయవచ్చన్నది వారి మాట!
మరీ ముఖ్యంగా పెదవుల ఆకారంలో చోటుచేసుకునే లయన్, జోకర్, ఫిషీ లక్షణాలు ఫేస్ యోగాతో దూరం పెట్టవచ్చును. కొంత మంది మహిళల మీద 5 నెలలపాటు జరిపిన పలు ప్రయోగాల్లో ఫేస్ యోగా ఫలితంగా చర్మంలోని మూడు పొరల్లో రక్తప్రసరణ పెరిగి, చర్మం సాగే గుణాన్ని సంతరించుకున్నట్టు పరిశోధకులు గమనించారు.
అంతేకాకుండా ఫేస్ యోగా వల్ల చర్మం కింద కొలాజన్ తయారై చర్మం బిగుతుగా తయారవటం కూడా వాళ్లు గమనించారు. ఈ వ్యాయామం వల్ల ముఖంలోని కండరాలు కూడా బలపడి, చర్మం నునుపుగా తయారవుతుంది. వయసు పైబడేకొద్దీ ముఖచర్మం, కండరాల మధ్య ఉండే కొవ్వు ప్యాడ్స్ పలచబడతాయి, చర్మం ముడతలు పడి సాగినప్పుడు ఆ కొవ్వు కూడా కిందకి వేలాడి వృద్ధాప్య లక్షణాలను తెచ్చిపెడుతుంది.
అయితే ముఖ వ్యాయామం వల్ల కండరాలు బలపడి, కొవ్వు పలచబడకుండా ఉండటం మూలంగా చర్మం కూడా బిగుతుగా ఉంటున్నట్లు పరిశోధనల్లో తేలింది. కాబట్టి నవయోవనంగా కనిపించాలంటే, ఇకనుంచి ఖరీదైన సౌందర్య చికిత్సలకు ప్రత్యామ్నాయంగా రోజుకి అరగంటపాటు ఫేస్ యోగా చేయండి.