కరివేపాకు చెట్టులోని ఆకులు, బెరడు, వేరు, గింజలు ఔషధగుణాలను కలిగిఉన్నాయి. కరివేపాకు పేగులకు, ఉదరమునకు బలాన్ని ఇవ్వడమే కాకుండా శరీరానికి కాంతిని కలిగిస్తుంది. ఆహార పదార్థాలకు రుచిని కలిగించడమే కాక అజీర్తిని నివారించి ఆకలిని పుట్టిస్తుంది.
అలర్జీని కలిగించే వ్యాధులు, ఉదయాన్నే లేచిన వెంటనే తుమ్ములు ప్రారంభం అవుతున్నప్పుడు, జలుబుతో తరచుగా బాధపడుతున్నవారు ప్రతిరోజు ఆహారంలో మొదటి ముద్దను కరివేపాకు పొడితో తీసుకోవడం వలన ఇలాంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చును.
గర్భధారణ జరిగిన తరువాత కడుపుతో ఉన్న బిడ్డకు తగినంత రక్తం అందాలంటే మందులతోపాటు కరివేపాకు పొడిని కూడా ఇవ్వాలి. బాలింతలకు కూడా ఇది వాడవచ్చును. రక్తవిరేచనాలు, జిగట విరేచనాలు, అవుతున్నప్పుడు కరివేపాకు పొడిని వాడకం కంటే దీనిని మజ్జిగలో కలుపుకొని రెండు లేదా మూడుసార్లు వాడితే మంచి ఫలితం ఉంటుంది.
మొలలు వ్యాధితో బాధపడే వారికి ఈ కరివేపాకు ఆకులు చాలా ఉపయోగపడుతాయి. కరివేపాకు చెట్టు బెరడు కూడా వైద్యానికి పనికొస్తుంది. దీనిని మెత్తగా నూరి కాస్తంత నీరు కలిపి దురదలు, పొక్కులు ఉన్నప్పుడు వాటిపై రాసి ఆరిన తరువాత స్నానం చేస్తే దురదలు నుండి విముక్తి చెందవచ్చును. కరివేపాకు క్యాన్సర్ వ్యాధిని నిరోధించేందుకు చాలా ఉపయోగపడుతుందని పరిశోధనలో తెలియజేశారు.