గ్యాస్ సమస్య ఏర్పడినప్పుడు అందరూ చేసే పని యాంటాసిడ్ వేసుకోవడం. అలా కాకుండా టీ స్పూను మిరియాలను వేయించి పొడి చేసి, చిటికెడు లవంగాల పొడి, పావుచెంచా వెల్లుల్లి మిశ్రమం తీసుకుని గ్లాసు నీటిలో మరిగించి వడకట్టి, తేనెతో కలిపి రోజూ రెండు మూడుసార్లు చొప్పున తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల కడుపులో గ్యాస్ సమస్యతోబాటు జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలు కూడా నయం అవుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
కప్పు మజ్జిగలో పావు చెంచా మిరియాల పొడిని కలిపి తీసుకోవచ్చు లేదా పసుపు, మిరియాల పొడి మిశ్రమాన్ని చిటికెడు చొప్పున తీసుకుని నీటిలో మరిగించి రాత్రిళ్లు తాగితే జలుబు, తుమ్ములు తగ్గుతాయి. పళ్లనొప్పులకు... అర టీ స్పూన్ నల్ల మిరియాల పొడి, కొద్దిగా లవంగం నూనెలను తీసుకుని మిశ్రమంగా తయారు చేయాలి. దాన్ని నొప్పి పెడుతున్న పన్నుపై అప్లై చేయాలి. రోజూ ఇలా చేస్తుంటే పంటినొప్పి తగ్గడంతోపాటు పళ్లు దృఢంగా తయారవుతాయి.
టేబుల్ స్పూన్ తాజా నిమ్మరసం, అర స్పూన్ నల్ల మిరియాల పొడి, టీస్పూన్ ఉప్పులను ఒక గ్లాస్ వేడినీటిలో కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. దీన్ని నోటిలో పోసుకుని పుక్కిలిస్తూ ఉంటే గొంతునొప్పి, మంట, దగ్గు తగ్గుతాయి. తలనొప్పి నివారణకు యాస్ప్రిన్ వేసుకోవడం అందరూ చేసే పనే. అలా కాకుండా దాల్చిన చెక్కను నీటితో తడిపి అరగదీసి కణతలకు పూస్తూ ఉంటే తలనొప్పి ముఖ్యంగా జలుబు వల్ల వచ్చే తలనొప్పి సులువుగా తగ్గిపోతుంది.