అబ్బ ఉదయం నిద్ర లేవడమే కష్టంగా ఉంది... ఒళ్లంతా బరువుగా, బద్ధంగా ఉంటోంది... అని మీ ఫీలింగా... అయితే రాత్రిళ్ళు కంచం నిండా అన్నం తినడం మానేయండి... హాయిగా రెండు లేదా మూడు చపాతీలు తినేయండి. మీ సమస్య ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది.
నిద్రించేప్పుడు మన శక్తి ఏమాత్రం ఖర్చు కాదు. దాంతో నైట్ తిన్న ఫుడ్ ద్వారా వచ్చిన క్యాలరీలు అలాగే పొట్టలో డిపాజిట్ అయిపోతాయి. అందుకే రాత్రి సమయంలో అన్నం తినడం వల్ల అది ఖర్చు కాక పోవడంతో కొవ్వుగా మిగిలి పోయి, మనిషి లావు అయ్యే ప్రమాదం ఉంది. రాత్రి సమయంలో భోజనం చేసి, వెంటనే పడుకోవడం ఆరోగ్యానికి మరింత హానికరం. అందుకే రాత్రి సమయంలో భోజనానికి బదులుగా చపాతి తింటే బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.
ప్లేట్ నిండుగా భోజనం చేసినా ఒకటే, రెండు లేదా మూడు చపాతీలు తిన్నా ఒక్కటేనని డాక్టర్లు అంటున్నారు. అన్నం కంటే చపాతి శరీరానికి అధిక శక్తినిస్తుందని నిరూపితం అయ్యింది. శక్తిని ఇస్తున్నంత మాత్రాన ఈ చపాతిల్లో కొవ్వు పదార్థాలు ఉండవు. ఎందుకంటే గోదుమల్లో ఎలాంటి కొవ్వు పదార్థాలు ఉండవు. వాటిల్లో ఎక్కువగా విటమిన్ బి, ఇ, కాపర్, అయోడిన్, జింక్, మాంగనీస్, సిలికాన్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఎన్నో ఖనిజాలు ఉంటాయి. గోదుమల్లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.
చపాతీలు చాలా ఈజీగా జీర్ణమవుతాయి. జీర్ణ వ్యవస్థపై ఎలాంటి ఒత్తిడి పడదు. ఏవైనా అతి అనారోగ్యమే. అందుకే చపాతి కూడా ఎక్కువగా తినకూడదు. ప్రతి రోజు మోతాదుకు మించి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చపాతిని చాలా తక్కువ నూనెతో కాల్చడం వల్ల ఉపయోగాలు మరింత ఎక్కువగా ఉంటాయి. అసలు నూనె వేయకుంటే మరింత మంచిది. ఇంకేం రాత్రిళ్ళు ఈ మెనూ ఫాలో అయిపోండి.