కొన్ని రకాల పదార్థాలు మానేసి మరికొన్నింటిని తీసుకుంటే సన్నబడటం సులువే. అయితే దాంతోపాటు చేసుకోవల్సిన మార్పులు మరికొన్ని ఉన్నాయి. ఉదయాన్నే అల్పాహారం, రెండుపూటల భోజనం.... ఇంతేగా అనుకుంటే చాలదు. కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినడాన్ని అలవాటు చేసుకోవాలి. దీనివల్ల తక్కువ కేలరీలు అందుతాయి. శరీరం ఇన్సులిన్‌ను తక్కువగా విడుదల చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అదే ఆకలిని తగ్గిస్తుంది. ఫలితంగా బరువూ అదుపులో ఉంటుంది.
ఆకలితో సంబంధం లేకుండా మీముందు ఎంత ఎక్కువ ఆహారం ఉంటే అంత ఎక్కువగా తినేస్తారని ఎన్నో అధ్యయనాలు తెలిపాయి. దీన్ని అధిగమించాలంటే చిన్న పళ్ళెం తీసుకుని కొద్దిగానే వడ్డించుకోవాలి. దానివల్ల తెలియకుండానే తక్కువగా తీసుకుంటాం. కాఫీ, టీలు తాగే గ్లాసులకు ఇదే సూత్రం వర్తిస్తుంది. ఎంత బిజీగా ఉన్నాసరే అన్నం ఒక్కటే కాదు. అల్పాహారం, స్నాక్స్ ఏవయినాసరే భోజనం చేసే డైనింగ్ టేబుల్ దగ్గర తినాలనే నియమాన్ని పెట్టుకోండి. ఫలితంగా టీ.వి, కంప్యూటరు ముందు కూర్చొని తినే అలవాటు తప్పుతుంది.