ఉద్యోగులు, గృహిణులు, యువత సైతం ఈ కాలంలో కూర్చోవడానికి, విశ్రాంతికోసం ఇంటికి పరిమితం కావడానికి ఇస్తున్న ప్రాధాన్యత నడవడానికి ఇవ్వడం లేదు. ఇంటినుంచి ఆఫీసుకు తిరిగి ఇంటికి మనిషిని చేర్చటంలో సొంత వాహనాలు మంచి వెసులుబాటును ఇచ్చినప్పటికీ ఈ క్రమంలో నడక గాలికెగిరిపోయి సమస్యలను కోరి ఆహ్వానించినట్టవుతోంది.
ఇంటినుంచి ఆఫీసుకు పోయాక కుర్చీల్లో కూర్చుని గంటల కొద్దీ పనిచేయటం ఇంటికి వచ్చిన తర్వాత కూడా టీవి చూడడం, తినడం, చదువుకోవడం, కుటుంబ సభ్యులతో కబుర్లు చెప్పటంతోనే కాలం వెళ్లబుచ్చటం వలన కండరాలు బిగుసుకుపోవటం అనేది సహజమైపోయింది.
శరీరానికి తగిన వ్యాయామం లేకపోతే కొన్ని కండరాలు మాత్రమే పనిచేస్తాయి. మరి కొన్ని కండరాలు రక్తప్రసరణ జరగక చచ్చుబడి పోవడమేకాక శరీరంలో అనేక రోగాలు తిష్ట వేస్తాయి. కండరాల జాయింట్లు పనిలేక బిగుసుకు పోతాయి. అంటే మన శరీరాన్ని మనమే డీ కండిషనింగ్ చేస్తున్నట్టు లెక్క. నడక లేకపోవటం వల్ల ఎముకలకు గట్టితనం కొరవడి వెళుసుగా మారేందుకు అవకాశం ఉంటుంది. పెళుసయిన ఎముకలు కీళ్ల జబ్బులకు దారి తీస్తాయి.