నిజానికి భారత్, చైనా, భూటాన్ సరిహద్దుల్లో భారత్, చైనా సైన్యం నిత్యం కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య గత కొన్ని రోజులుగా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనివుంది. చైనా మీడియా కూడా భారత్‌ను తూర్పారబడుతున్నాయి. ఈ నేపథ్యంలో జీఎస్టీపై మోడీపై చైనా మీడియా ప్రశంసలు కురిపించడం గమనార్హం.
భారత్‌లో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు అమోఘమని కీర్తించింది. జీఎస్‌టీ చాలా గొప్పదని, ఆ ఘనత మోడీకే దక్కుతుందని కొనియాడింది. జీఎస్టీ కారణంగా లో-కాస్ట్ తయారీ రంగం నెమ్మదిగా ఇండియాపై మరలుతుందని, ప్రపంచ మార్కెట్లోని తమ ఆధిపత్యాన్ని త్వరలోనే భారత్ భర్తీ చేసే అవకాశం ఉందని అభిప్రాయపడింది.
ముఖ్యంగా, మేకిన్ ఇండియాకు జీఎస్‌టీ బూస్ట్‌లా ఉపయోగపడుతుందని పేర్కొంది. జీఎస్‌టీ రాష్ట్రాల పన్నుల్లో ఉన్న తేడాలు సమసిపోయానని వివరించింది. ఫలితంగా దేశమంతా ఒకే మార్కెట్ ఏర్పడుతుందని, దీనివల్ల దేశానికి మంచే జరుగుతుందని వ్యాఖ్యానించింది. జీఎస్టీ వల్ల భారత్‌కు అంతర్జాతీయ పెట్టుబడులు వెల్లువెత్తుతాయని ‘గ్లోబల్ టైమ్స్’ తన కథనంలో వివరించింది.