పైగా, ఈ సూసైడ్ బాంబర్లలో ఎక్కువ మంది సంపన్న కుటుంబాలకు చెందినవారు, విద్యావంతులే కావడం గమనార్హం. ఒక సూసైడ్ బాంబర్ బ్రిటన్‌లో డిగ్రీ, ఆస్ట్రేలియాలో పీజీ చేసి వచ్చి శ్రీలంకలో స్థిరపడినట్టు తెలిసిందన్నారు. సూసైడ్ బాంబర్లకు నేతృత్వం వహించిన ఇద్దరు సోదరులు షాంగ్రీలా, సిన్నామన్ గ్రాండ్ హోటళ్లలోకి ప్రవేశించిన సీసీటీవీ ఫుటేజీలు లభించాయి.
వీరి మరో సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి ఇంట్లో విద్వేషపూరిత సాహిత్యం, కంప్యూటర్ హార్డ్ డిస్క్, సిమ్‌కార్డులు లభించాయని చెప్పారు. దెహీవాలా ప్రాంతంలోని నేషనల్ జూ సమీపంలో ఉగ్రవాదులు నివాసం ఉన్న ఇంటి ఓనర్‌ను, పేలుళ్లకు ముందు వారిని హోటళ్లు, లాడ్జీలకు చేర్చిన ట్యాక్సీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
శ్రీలంక నుంచి మసాలా దినుసులను ఇతర దేశాలకు ఎగుమతి చేసే ముస్లిం వర్గానికి చెందిన పారిశ్రామికవేత్త కుటుంబానికి చెందిన సభ్యులే మానవబాంబులుగా మారిపోయారు. పేలుళ్లు జరిగిన తర్వాత వీరి ఇంట్లో తనిఖీ చేసేందుకు వెళ్లగా, ఆ ఇంటి కోడలు తనను తాను పేల్చుకుంది. ఈ పేలుడులో ఆమెతో పాటు ఇద్దరు చిన్నారులు, నలుగురు పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, శ్రీలంక పేలుళ్లలో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన సంఖ్య 359 మంది మృతిచెందినట్లుగా సమాచారం.