ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని ఓ మసీదులో శక్తిమంతమైన బాంబు పేలింది. ఈ పేలుడు ధాటికి 66 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. పవిత్ర రంజాన్ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ఖలీసా సాహిబ్ మసీదుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. దీంతో మసీదు కిక్కిరిపోయింది. ఇదే అదునుగా భావించిన ఓ ఉగ్రవాది మానవబాంబుగా మారి తనను తాను పేల్చుకున్నాడు.
అయితే, ఈ మానవబాంబు పేలుడుకు ఇప్పటివరకు ఏ ఒక్క సంస్థా నైతిక బాధ్యత వహించలేదు. పేలుడుపై ఆప్ఘన్ భద్రతా బలగాలు దర్యాప్తు చేపట్టాయి. మసీదు వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా, ఈ పేలుడు ధాటికి మసీదు పైకప్పు కూడా కూలిపోయినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనంగా ఉంది.