కాశ్మీరీలు ఆయుధాలు చేపట్టి పోరాడాలి.. ఇమ్రాన్ ఖాన్ పిలుపు

శనివారం, 14 సెప్టెంబరు 2019 (12:54 IST)
కాశ్మీర్ ప్రజలను రెచ్చగొట్టేలా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. కాశ్మీర్‌ అంశంలో ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టలేకపోయిన ఆయన కాశ్మీరీ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. భారత్‌లోని బీజేపీ-ఆరెస్సెస్‌ నియంత్రణలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాశ్మీరీలు ఆయుధాలు చేపట్టి పోరాడాలని ఇమ్రాన్‌ఖాన్‌ పిలుపునిచ్చారు. 
 
ముజఫరాబాద్‌లో జరిగిన ర్యాలీనుద్దేశించి ఇమ్రాన్‌ఖాన్‌ ప్రసంగించారు. అమాయక కాశ్మీరీల సహనాన్ని ప్రధాని మోదీ పరీక్షిస్తున్నారని ఇమ్రాన్‌ఖాన్‌ అన్నారు. ప్రపంచానికి తాను కాశ్మీర్‌ రాయబారిగా వ్యవహరిస్తూ వారికి బాసటగా నిలుస్తానని చెప్పారు. 
 
ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో తాను కాశ్మీరీలను నిరాశపరచనని చెబుతూ కాశ్మీర్‌ సమస్య మానవతా సంక్షోభమని తెలిపారు. ఐరోపా యూనియన్‌, బ్రిటన్‌ పార్లమెంట్‌లు సైతం కాశ్మీర్‌ అంశాన్ని చర్చించాయని చెప్పుకొచ్చారు. కాశ్మీర్‌లో భారత సేనలు హింసకు తెగబడినా ఎలాంటి ఫలితం ఉండదని మోదీ సర్కార్‌పై మండిపడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు