అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఈయన ఖాతాలో 264 ఎలక్టోరల్ ఓట్లు, డోనాల్డ్ ట్రంప్‌కు 214 ఓట్లు వచ్చాయి. అంటే అమెరికా అధ్యక్షుడుగా జో బైడెన్ ఎన్నిక ఖాయమని తెలుస్తోంది. దీంతో పాకిస్థాన్ దేశంలో సంబరాలు మిన్నంటాయి. దీనికి కారణం పాకిస్థాన్‌తో బైడెన్‌కు ఉన్న అనుబంధమే కారణం.
గతంలో పాకిస్థాన్‌కు 1.5 బిలియన్ల నాన్ - మిలిటరీ సాయాన్ని అందించే కార్యాచరణ వెనుక బైడెన్, సెనేటర్ రిచర్డ్ లుగార్ ఉన్నారు. మరో విషయం ఏమిటంటే లుగార్‌ను కూడా పాకిస్థాన్ 'హిలాల్ ఇ పాకిస్థాన్' పురస్కారంతో సత్కరించింది. పాకిస్థాన్‌కు నిరవధికంగా సాయం అందించేందుకు తోడ్పడుతున్న వీరిద్దరికీ అప్పటి పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ బహిరంగంగా కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు ఎన్నికల ప్రచారంలో భారతీయ అమెరికన్లను ఆకట్టుకోవడానికి బైడెన్ మన దేశానికి అనుకూలంగా కూడా మాట్లాడారు. అయితే, చైనాలోని ఉయ్ ఘర్ ముస్లింల సమస్యతో కాశ్మీర్ లోయ పరిస్థితులను ముడిపెడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.