అమెరికాలో భారీ పోలింగే డోనాల్డ్ ట్రంప్ కొంప ముంచిదా?
శుక్రవారం, 6 నవంబరు 2020 (08:58 IST)
అమెరికా అధ్యక్ష పీఠానికి ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ బుధవారం నుంచి మొదలైంది. కానీ, ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. అయితే, విజయం మాత్రం డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రస్తుత అధినేత డోనాల్డ్ ట్రంప్‌కు తేరుకోలేని షాక్ తగిలింది.
ఇటు పాపులర్ ఓట్ల శాతంలోను, అటు ఎలక్టోరల్ ఓట్లలోనూ ఆయన ప్రత్యర్థి జో బైడెన్ కంటే వెనుకబడిపోయారు. దీనికి కారణం ఆయన వైఖరి ఒకటైతే.. మరొకటి భారీ పోలింగ్ నమోదు కావడం. 120 యేళ్ళ అమెరికా చరిత్రలో ఇంతటి భారీ పోలింగ్ ఇంతకుముందెన్నడూ నమోదుకాలేదు.
అమెరికాలో మొత్తం 23.9 కోట్ల ఓటర్లు ఉండగా 15.9 కోట్ల మంది హక్కును వినియోగించుకున్నారు. ఇంత భారీ సంఖ్యలో ఓట్లు పోలవడం 120 ఏళ్లలో తొలిసారి. 2016 అధ్యక్ష ఎన్నికల్లో 13.6 కోట్ల ఓట్లే పోలయ్యాయి. హవాయ్, టెక్సాస్ తదితర రాష్ట్రాల్లో 2016తో పోల్చుకుంటే భారీ పోలింగ్ నమోదైంది.
2008లో అత్యధికంగా 62.2 శాతం, 2004లో 60.7 శాతం నమోదైంది. 2016లో 59.2 మంది ఓటేయగా.. ఇప్పుడు 66.8 హక్కును వినియోగించుకున్నారు. 1900లో 73.2 శాతం పోలింగ్ నమోదైంది. ఇపుడు ఇదే డోనాల్డ్ ట్రంప్ కొంప ముంచింది.
అంతేకాకుండా, గత ఎన్నికల్లో విజయం సాధించినా 6.29 కోట్ల (46.1శాతం) కంటే ట్రంప్‌నకు ఈ సారి చాలా ఎక్కువ పాపులర్ ఓట్లు వచ్చాయి. కానీ ఆయన ఓటమి బాటలో ఉన్నారు. చిత్రమేమంటే.. 2016లో డెమొక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ (6.58 కోట్ల ఓట్లు.. 48.1శాతం)కు ట్రంప్ కంటే పాపులర్ ఓట్లు ఎక్కువగా వచ్చాయి.
కానీ, విజేతను నిర్ణయించే ఎలక్టోరల్ ఓట్లలో ఆమె వెనుకబడ్డారు. ట్రంప్‌నకు 304 ఎలక్టోరల్ ఓట్లు రాగా, హిల్లరీ(227) చాలా దూరంలో ఆగిపోయారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా 66.8 పోలింగ్ నమోదైంది.
మరోవైపు, ఈ ఎన్నికల్లో జో బైడెన్ సరికొత్త చరిత్రను సృష్టించారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను సైతం ఆయన వెనక్కి నెట్టేశారు. ప్రస్తుత ఎన్నికల్లో బైడెన్ ఏకంగా 7.20 కోట్లపైగా పాపులర్ ఓట్లతో చరిత్ర సృష్టించారు.
2008 ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి, పూర్వ అధ్యక్షుడు బరాక్ బబామా సాధించిన 6.94 కోట్ల ఓట్ల(52.9) రికార్డును ఆయన చెరిపేశారు. 7 కోట్ల మార్క్‌ను చేరుకున్న తొలి అభ్యర్థిగానూ ఘనతకెక్కారు. ట్రంప్ సైతం 7 కోట్ల పాపులర్ ఓట్లు సాధించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం 6.87 కోట్ల ఓట్లతో ఒబామా రికార్డుకు దగ్గరగా ఉన్నారు.