నాసాలో నిద్రపోయే ఉద్యోగం... నెలకు రూ.6.5 లక్షల జీతం

ఆదివారం, 31 మార్చి 2019 (13:57 IST)
సాధారణంగా అనేక సోమరిపోతులకు ఉదయాన్నే నిద్రలేవాలంటే బద్దకం. మరికొంతమందికి పొద్దున్నే నిద్రలేచి పనులు చేసుకోవాలన్నా కష్టమే. కానీ, అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ, మరో రెండు స్పేస్ ఏజెన్సీలు ఇలాంటి సోమరిపోతుల కోసం సరికొత్త ఉద్యోగ ఆఫర్ను కల్పిస్తున్నాయి. ఆ ఉద్యోగం ఏంటంటే.. శరీరాన్ని కదల్చకుండా 24 గంటల పాటు నిద్రపోవడమే. ఇందుకోసం నెల వేతనంగా రూ.6.50 లక్షలను చెల్లిస్తారు. అయితే, ఈ ఉద్యోగం కేవలం రెండు నెలలు మాత్రమే. ఈ రెండు నెలలుకు ఇచ్చే వేతనం రూ.13 లక్షలు. ఏంటి నమ్మబుద్ధికావడం లేదా. అయితే ఈ కథనాన్ని చదవండి. 
 
జర్మన్ ఏరోస్పేస్ ఏజెన్సీ, అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలకు 2019 సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు 21 మంది వాలంటీర్లు కావాలి. జర్మనీలోని కొలోన్ ప్రాంతంలో రెండు నెలలపాటు వాలంటీర్ల సేవలను వారు వినియోగించుకుంటారు. వాలంటీర్లు చేసే పని ఏమీ ఉండదు. కేవలం మంచం మీద పడుకుని ఉండటమే. పైగా రెండు నెలలకుగాను 19 వేల డాలర్లు (రూ.13 లక్షలు) జీతం ఇస్తారు. 
 
ఈ ఉద్యోగానికి ఎంపికయ్యే వాలంటీర్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఒక గ్రూపు అపకేంద్రయంత్రం(సెంట్రిఫ్యూజ్)లో తిరుగుతూ ఉండగా.. మరో గ్రూపు స్థిరంగా ఉంటుంది. ఈ రెండు నెలలు తిండి, స్నానం కూడా ఉంటాయని స్పేస్ ఏజెన్సీలు చెప్పాయి.
 
ఇలా చేయడం వల్ల కలిగే ఉపయోగం ఏమిటంటారా? ఎటూ కదలకుండా విశ్రాంతి తీసుకోవడం వల్ల శరీరంలో అనేక మార్పులు కలుగుతాయని, వెయిట్‌లెస్‌నెస్ ద్వారా శరీరమార్పులు గమనించవచ్చని స్పేస్ ఏజెన్సీలు చెబుతున్నాయి. వెయిట్‌లెస్‌నెస్ వల్ల కలిగే నష్టాలను తెలుసుకుని వాటికి పరిష్కారానికి పరిశోధనలు చేస్తారు. ఈ టెక్నిక్‌ తమ వ్యోమగామీలకు బాగా ఉపయోగపడుతుందని వారు అభిప్రాయపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు