మామ్‌పై వెకిలి కార్టూన్ ఫలితం... సారీ చెప్పిన న్యూయార్క్ టైమ్స్ ఎడిటర్!

మంగళవారం, 7 అక్టోబరు 2014 (18:32 IST)
ఇస్రో ప్రయోగించిన మంగళ్యాణ్ ప్రయోగాన్ని (మార్స్ శాటిలైట్‌) హేళన చేసేలా గీసిన ఓ వెకిలి కార్టూన్‌ను తమ పత్రికలో ప్రచురించినందుకు అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్ ఎడిటర్ భారత ప్రజలకు క్షమాపణ చెప్పారు. భారత్ తాను చేసిన తొలి ప్రయత్నంలోనే అంగారక కక్ష్యలోకి మాస్ ఆర్బిటర్ మిషన్‌ను ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించిన విషంయ తెల్సిందే. అత్యంత చౌకగా అరుణ గ్రహ యాత్ర నిర్వహించడం ద్వారా సాంకేతికత పరంగా అగ్రరాజ్యాలకు సవాల్ విసిరింది. ఈ ఘనమైన యాత్ర నేపథ్యంలో 'ద న్యూయార్క్ టైమ్స్' దినపత్రిక ఓ కార్టూన్ వేసింది. ఆ కార్టూన్ ఎలా ఉందంటే... 
 
'ఎలైట్ స్పేస్ క్లబ్' అని రాసి ఉన్న ఓ గదిలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఓ వ్యక్తి చేతిలో ఉన్న దినపత్రికలో భారత్ మార్స్ మిషన్ పై వార్త కనిపిస్తూ ఉంటుంది. ఆ గదికి వెలుపల ఓ భారత రైతు ఆవును వెంటేసుకుని వచ్చి తలుపు తడుతుంటాడు. అయితే, ఈ కార్టూన్ పై పాఠకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో, పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పింది. 
 
దీనిపై పత్రిక ఎడిటోరియల్ పేజీ సంపాదకుడు ఆండ్రూ రోసెంథాల్ ఫేస్‌బుక్‌లో స్పందించారు. ఈ కార్టూన్ పై పెద్ద సంఖ్యలో పాఠకులు ఫిర్యాదులు చేశారని తెలిపారు. కార్టూనిస్టు హెంగ్ కిమ్ సాంగ్ ఉద్దేశం భారత్ ను అవమానించడం కాదని రోసెంథాల్ స్పష్టం చేశారు. అంతరిక్ష పరిశోధన ఇక ఎంతమాత్రం సంపన్న పాశ్యాత్య దేశాల గుత్తసొత్తు కాదని చెప్పడమే కార్టూనిస్టు అభిమతమని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి