శుక్రవారం ఇస్లామాబాద్‌లో భద్రతాదళాలతో రహీల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమాయకులైన కాశ్మీరీలపై భారత సైన్యం అరాచకాలకు పాల్పడుతోందని, వాటి నుంచి ప్రపంచం దృష్టి మరల్చేందుకే సర్జికల్ దాడుల డ్రామా అడుతోందని విమర్శించారు. ప్రభుత్వంతో పాక్ ఆర్మీకి విభేదాలు ఉన్నాయంటూ వచ్చిన 'డాన్' పత్రిక కథనాన్ని భేటీ ఖండించింది.
కాగా ఈ కథనాన్ని రాసిన జర్నలిస్టు విదేశీ పర్యటనలపై విధించిన నిషేధాన్ని శుక్రవారం ఎత్తివేశారు. కాగా, సర్జికల్ దాడులపై పాక్ మీడియా కల్పిత కథనాలను వండివారుస్తోందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ స్పష్టం చేశారు. 'ద న్యూస్ ఇంటర్నేషనల్' పత్రిక కథనం కల్పితమన్నారు.
మరోవైపు.. జమ్ముకాశ్మీర్ శ్రీనగర్ శివార్లలోని జకురా ప్రాంతంలో ఎస్ఎస్బి జవాన్ల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. సాయంత్రం 7.30 గంటల సమయంలో విధులు ముగించుకుని ఆరు వాహనాల్లో వెళ్తున్న జవాన్లను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. కాన్వాయ్‌లోని చివరి వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు దిగారు. ఒక జవాన్ చనిపోయారు. మరో 8 మంది జవాన్లు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.