మనసుకు నచ్చిన కార్లను కొనటం.. వాటి నెంబర్ల కోసం వేలం పాటలో పాల్గొనటం.. పోటాపోటీగా ధర చెల్లించేందుకు సిద్ధపడటం తెలిసిందే. ఒక నెంబర్ కోసం ఎంతకైనా రెఢీ అన్నట్లుగా వ్యవహరించటమే కాదు.. రికార్డు మొత్తాన్ని వెచ్చించిన వైనం తాజాగా చోటుచేసుకుంది. కారు రేటు ఎంతో కానీ.. ఆ కారు నెంబరు కోసం ఏకంగా రూ.60 కోట్ల రూపాయిలు చెల్లించేందుకు సిద్ధపడిన సంచలన ఉదంతమిది.
ఎప్పుడూ నెంబర్ 1 గా ఉండాలని తపించే ఆయన.. తన కారుకు తాను కోరుకున్న ''డి5'' ఉండాలని డిసైడ్ అయ్యారు. అంతే వేలం పాటలో వెనుకాడని ఆయన.. అనుకున్న నెంబర్ కోసం రూ.60 కోట్లు పెట్టేందుకు వెనుకాడలేదు. బల్వీందర్ సహానీ అనే ఆయన ఆర్ఎస్‌జీ ఇంటర్నేషనల్ అనే వ్యాపార సంస్థకు యజమాని. భారతదేశంతో పాటు అమెరికా, యూఏఈ, కువైట్ వంటి దేశాల్లో ఈ కంపెనీ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ పనులు చేస్తుంటుంది.
ఈయన 'డి5' అనే నెంబరు కోసం దుబాయ్ రోడ్డు రవాణా వ్యవస్థకు రూ.60 కోట్లు చెల్లించాడు. అరుదైన నెంబరు ప్లేట్లు సేకరించడం తనకు ఇష్టమని.. ఈ నెంబరు రావడం చాలా గర్వంగా ఉందని సహానీ తెలిపారు. తనకు 9 అంకె అంటే ఇష్టమని, డి5 కలిపితే మొత్తం 9 అవుతుందని.. అందుకే తాను ఈ నెంబరును కొన్నానని చెప్పారు. గత సంవత్సరం తాను 09 అనే నెంబరు ఉన్న ప్లేటును రూ.45 కోట్లు పెట్టి కొన్నట్లు తెలిపారు.
ఇప్పటివరకు తాను 10 నెంబరు ప్లేట్లు కొన్నానని, త్వరలోనే మరిన్ని కూడా కొంటానని వెల్లడించారు. తాజాగా కొన్న ప్లేటును తనకున్న రోల్స్ రాయిస్ కార్లలో ఒకదానికి అమరుస్తానన్నారు. డి5 నెంబరు కోసం దాదాపు 300 మంది పోటీపడ్డారు. చివరికి ఆ నెంబర్ తనకే దక్కడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.