అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్, ఉత్తర కొరియాలపై విరుచుకుపడ్డారు. ఉత్తర కొరియా అణు పరీక్షలను లెక్కచేయబోమని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికాను భయపెట్టాలని ఓ వైపు నుంచి ఉత్తర కొరియా, మరోవైపు నుంచి ఇరాన్ దేశాలు కలలు కంటున్నాయని, వారి కలలు నెరవేరే సమస్యే లేదని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ పూర్తి ఉగ్రవాద దేశం గా మారేలా అడుగులు వేస్తోందని ట్రంప్ ఆరోపించారు.
కయ్యానికి కాలుదువ్వుతున్న ఉత్తర కొరియాను కట్టడి చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక సలహాదారులతో సమావేశమయ్యారు. ఉత్తర కొరియా ఎలాంటి అతిక్రమణలకూ దిగినా స్పందించేందుకున్న అవకాశాలు, అమెరికా మిత్రదేశాలపై కిమ్ ప్రభుత్వం అణుదాడి బెదిరింపులను అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చ జరింగింది. రక్షణమంత్రి జేమ్స్ మాటిస్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ జోసెఫ్ డన్ఫోర్డ్ కూడా ఈ బేటీలో పాల్గొన్నారు.