ఉత్తరకొరియా అంశం ఏదో ఒకటి చేయాల్సిన దశకు చేరుకుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దుందుడుకు చర్యలకు పాల్పడుతోన్న ఉత్తరకొరియా అంశంపై తమ రక్షణ శాఖ అధికారులతో ట్రంప్ చర్చించారు. ఆ సమయంలోనే ఉత్తర కొరియాపై అమెరికా యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఉత్తరకొరియా మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఈ సమావేశం అనంతరం ట్రంప్ మాట్లాడుతూ, ఇప్పటికే ఉత్తరకొరియా అంశంపై సైనిక, రక్షణ శాఖ సలహాదార్లతో చర్చించినట్లు చెప్పారు. ఆ దేశం విషయంలో తాను భిన్నమైన వైఖరి కలిగి ఉన్నట్లు వ్యాఖ్యానించారు. తాను ప్రపంచానికి, అమెరికాకు మేలు చేసే నిర్ణయాన్నే తీసుకుంటానని, తమ దేశంలో గత ప్రభుత్వాలే ఉత్తర కొరియా సమస్యను పరిష్కరించి ఉండాల్సిందని ట్రంప్ అన్నారు.
మరోవైపు.. అమెరికా మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. యూనైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైన్‌టిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) నుంచి తాము వైదొలుగుతున్నట్లు ప్రకటన చేసింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి కొన్ని రోజుల ముందు 'పారిస్ ఒప్పందం' నుంచి తప్పుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
కాగా, యునెస్కో యాంటీ ఇజ్రాయెల్ విధానంతో ఉందంటూ అమెరికా చాలా కాలం నుంచి ఆరోపిస్తోంది. ఈ విషయంపై యూనెస్కో తమ పాలసీకి సానుకూలంగా లేని కారణంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ అంశంపై అమెరికా నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. తాము తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఈ ఏడాది డిసెంబరు 31 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు అమెరికా తెలిపింది.