హెచ్-1బి వీసా కోసం రెండోసారి లాటరీ - విద్యార్థుల కోసం రెట్టింపు ఫ్లైట్స్

శనివారం, 31 జులై 2021 (11:28 IST)
హెచ్‌-1బీ వీసా ఎంపికలో అవకాశం దక్కనివారికి మరో అవకాశం కల్పించేందుకు అగ్రరాజ్యం అమెరికా ఓ మంచి నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది రెండోసారి లాటరీ తీయనున్నట్టు యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) గురువారం వెల్లడించింది. ఈ ఏడాది మొదట్లో డ్రాలో కాంగ్రెషనల్‌ మ్యాండేట్‌ నిబంధనల ప్రకారం సరిపడినన్ని వీసాలు జారీచేయని కారణంగా మరోసారి లాటరీ తీయాలని నిర్ణయించినట్టు పేర్కొంది.
 
ఇదిలావుంటే, అమెరికా వెళ్లే విద్యార్థుల కోసం వచ్చే నెల నుంచి అమెరికాకు రెట్టింపు సంఖ్యలో విమాన సర్వీసులు నడపనున్నట్టు ఎయిర్ ఇండియా తెలిపింది. దేశంలో రెండో దశ కరోనా విజృంభణ కారణంగా భారత్ నుంచి విమానాల రాకపోకలను అమెరికా నియంత్రించింది. 
 
దీంతో ఎయిర్ ఇండియా పలు విమాన సర్వీసులను రద్దు చేసింది. రద్దయిన విమానాల్లో ముంబై-నెవార్క్ విమానం కూడా ఉంది. నిజానికి, భారత విమానాలపై అమెరికా ఆంక్షలు విధించకముందు ఎయిర్ ఇండియా 40 వరకు విమాన సర్వీసులు నడిపేది. జులై నాటికి అవి 11కు పడిపోయాయి.
 
అమెరికాలో పలు యూనివర్సిటీలు ఆగస్టు నుంచి తెరుచుకోనుండడంతో హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల నుంచి వెళ్లే వేలాదిమంది విద్యార్థులు విమానాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా ప్రకటనపై వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
కాగా, అమెరికాకు ప్రస్తుతం 11 సర్వీసులు నడుస్తుండగా ఆగస్టు 7వ తేదీ నుంచి ఈ సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్టు ఎయిర్ ఇండియా వెల్లడించింది. అలాగే, ముంబై-నెవార్క్ మధ్య ఆగస్టు 6, 13, 20, 27 తేదీల్లో అదనపు సర్వీసులు నడపనున్నట్టు ఎయిర్ ఇండియా తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు