కరోనా వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా ఏ విధంగా తల్లడిల్లిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఈ వైరస్ మహమ్మారి నుంచి ఆ దేశం త్వరగానే కోలుకుంది. కొన్నినెలల క్రితం కరోనా కేసులు తగ్గు ముఖం పట్టడం, పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుండడంతో మాస్కులు పెట్టుకోవాలన్న నిబంధనను ఎత్తివేశారు.
కానీ, గత కొన్ని రోజులుగా అమెరికాను కరోనా డెల్టా వేరియంట్ కలవరపెడుతోంది. దీంతో కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు పెట్టుకోవాల్సిందేనని అమెరికా ప్రభుత్వం కొత్తగా ఆదేశాలు జారీ చేసింది.
టీకాలు ప్రభావవంతంగానే పనిచేస్తున్నాయని అమెరికా అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ ఫౌచీ వ్యాఖ్యానించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో డెల్టా వేరియంట్ కేసులు అధికమవుతున్నాయని, థర్డ్ వేవ్ తప్పదంటూ హెచ్చరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఖచ్చితంగా మాస్క్‌లు ధరించాలని కోరుతున్నారు.