"భల్లూకపు పట్టు" అంటే..?

పిల్లలూ...! "అబ్బా... వాడిది భల్లూకపు పట్టు, ఒకసారి పట్టుకున్నాడంటే వదలడు" అనే మాటలను మీరు వినే ఉంటారు. ఏదైనా పనిని తలపెడితే అది పూర్తయ్యేదాకా వదలిపెట్టని వారి పట్టుదలనే "భల్లూకపు పట్టు" అని అంటారు.

అసలు ఈ భల్లూకపు పట్టు కథా కమామీషేంటో ఇప్పుడు చూద్దాం. భల్లూకం అంటే, ఎలుగుబంటి అని అర్థం. ఇది ఇతర జంతువులకు లేని ఒక ప్రత్యేక గుణాన్ని కలిగి ఉంటుంది. అదేంటంటే... ఇతర జంతువులు తాము వేటాడే జంతువును పట్టుకున్నా, ఒక్కోసారి పట్టుజారి పోతుంటాయి. కానీ, ఈ భల్లూకానికి మాత్రం ఏదేని జంతువు దొరికిందంటే... ఇక అది తప్పించుకునేందుకు ఎలాంటి అవకాశమూ ఉండదు, అంత గట్టిగా పట్టుకుంటుందన్నమాట..!

ఇలాగే... కొంతమంది వ్యక్తులు వారు అనుకున్న పనిని సాధించేంతదాకా, పట్టువదలకుండా కృషి చేస్తుంటారు. ఇలాంటి గట్టి పట్టుదల కలిగిన మనుషులను గురించి చెప్పేటప్పుడు, ఎలుగుబంటికి ఉన్న ఈ గుణంతో పోల్చుతూ... "భల్లూకపు పట్టు" అనే జాతీయాన్ని మన పెద్దలు వాడుకలోకి తెచ్చారు.

వెబ్దునియా పై చదవండి