అరువుకు తెచ్చుకోలేనిదే ఆత్మవిశ్వాసం

ఎంత కష్టమో... అంత ఆనందం...
  ఆత్మగౌరవం... ఆత్మవిశ్వాసం... అత్మస్థైర్యం.... ఈ పదాలు పలకడానికి చాలా భారంగా, బరువుగా అనిపిస్తాయి. పలకడానికి ఎంత భారంగా ఉన్నాయో ఈ మూడింటితో సహజీవనం చేయడం అంతే కష్టం. ఆచరిస్తే అంతులేని ఆనందం.      
సాధారణంగా ప్రతి ఒక్కరిలోనూ చేసే పనులపైనా, చేపట్టబోయే పనులపైనా ఓ అంచనా ఉంటుంది. పూర్తి చేయగల సామర్థ్యం ఉంటుంది. కాని లోపల ఎక్కడో ఓ అపనమ్మకం.... అనుమానం.... సందేహం... సంశయం... మొత్తంపై 'నేను ఈ పని చేయగలనా' అనే ప్రశ్న తలెత్తుంది. ఇది చాలా మందిలో ఉండే మానసిక లక్షణంగా చెప్పవచ్చు.

ఇది కాస్త ఎక్కువగా ఉన్నావారిని చూసినపుడు అబ్బా...! ఆయన మీదే ఆయనకే నమ్మకం లేదు. ఇక ఇచ్చిన పనేం పూర్తి చేస్తాడు అంటాం కదూ.... ఏదైనా ఓ కార్యక్రమం మొదలు పెట్టే ముందు ఎవరికైనా తన మీద తనకు నమ్మకం అవసరం. 'ఈ కార్యాన్ని నేను నెరవేర్చగలను' అనే నమ్మకం ఉండాలి. ఇందుకు సంబంధించిన గట్టి నమ్మకమే... ఆత్మవిశ్వాసం.

ఇది మార్కెట్‌లో దొరుకుతుందా? లేదా అరువుకిస్తారా? ఇది కిలోల లెక్కన తూకానికి, గంటల లెక్కన అరువుకిచ్చేది కాదు. అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఎలా లభ్యమవుతుందనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. దీనికి ఇప్పటికే మీకు సమాధానం లభించింది. అది మనిషి మానసిక స్థితి నుంచి పుట్టుకొస్తుంది.

దానిని అదే నిలుపుకుంటుంది. పదును పెట్టుకోవడానికి...పనిని ఆరంభించబోయే ముందు అంచనాలు, సామర్థ్యం చాలా అవసరం. ఆ విషయంపై అవగాహన ఉన్నపుడు అంచనా సులవవుతుంది. గణాంకాలు వేసుకోవాలి. అప్పుడే తనపై తనకు మరింత నమ్మకం పెరుగుతుంది. నమ్మకం పెరిగితే ఆత్మవిశ్వాసం లభించినట్లే.

అయితే అంచనాలు లేకుండా కార్యక్రమం పూర్తి చేయగలననుకుంటే అది అతి ఆత్మవిశ్వాసం అవుతుంది. దీని వలన మీ మీద ఇతరులకున్న నమ్మకాన్ని కోల్పోతారు. ఇది చాలా ప్రమాదకరం. ఆత్మవిశ్వాసమైన, అతి ఆత్మ విశ్వాసమైనా మానసికస్థతిపైనే ఆధారపడుతాయి. ప్రస్తుత సమాజంలో మొదటగా అవసరమయ్యేది ఆత్మవిశ్వాసమే.

వెబ్దునియా పై చదవండి