అబ్బాయిలూ... మీకు మీరే అందగాళ్లనుకుంటున్నారా? సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలోనో, డేటింగ్ సైట్లలోనో గల మీ ప్రొఫైళ్లలో రెండు మూడు ఆకర్షణీయమయిన ఫోటోలు పెట్టేస్తే అమ్మాయిలు మీ ప్రేమలో పడిపోతారనే ఆలోచనల్లో ఉన్నారా? అయితే, మీరు పొరపడుతున్నట్లేనంట! మీరు నిజంగా అందగాళ్లో కాదో, ఆకర్షణీయ వ్యక్తిత్వం గలవారో తెలుసుకోవడానికి ఆడాళ్లకు మీ ఫొటోలను ప్రత్యేకించి చూడాల్సిన అవసరం లేదట. మీ ఫొటోలు చూడకుండానే వారు మీ ప్రొఫైల్ చదివేసి మీరు నిజంగా అందగాళ్లో కాదో నిర్ణయించేస్తారని ఒక అధ్యయనంలో తేలింది.
ఆ అధ్యయనం ప్రకారం, అందగాళ్లలో సహజంగానే ఆత్మవిశ్వాసం పాళ్లు ఎక్కువగానే ఉంటాయి, అది వారి వారి ప్రొఫైళ్లలో తమ గురించి రాసుకునే స్వ-పరిచయల్లో ప్రతిబింబిస్తుంది. తమ ప్రొఫైళ్లలోని స్వపరిచయ వివరాలను చూసి అమ్మాయిలు, తమకు నచ్చినవారిని ఎంపిక చేసుకుంటారట.
అమెరికాలోని విల్లినోవా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు 50 మంది విశ్వవిద్యాలయ విద్యార్ధినులను ప్రశ్నించారు. ఆయా డేటింగ్ వెబ్ సైట్లలో గల 22 నుండి 25 ఏళ్ల వయసు లోపు 100 మంది అబ్బాయిల ప్రొఫైళ్లను పరిశీలించమని కోరారు. విద్యార్థినుల్లో ఒక్కొక్కరికి 25 మంది కుర్రాళ్ల ఫొటో గ్రాఫ్‌లను అందచేసి, వారిలో తమకు ఎవరు నచ్చారో చెప్పమని, రేట్ చేయమని సూచించారు.
ఆ 25మందిలో తాము ఆకర్షణీయమయిన వారిగా భావించిన వ్యక్తులతో డేటింగ్ చేయాలనుకుంటున్నారా? లేదా తాత్కాలిక లైంగిక సంబంధాన్ని పెట్టుకోవాలనుకుంటున్నారా? లేదా దీర్ఘకాలిక సంబంధానికి మొగ్గుచూపుతున్నారా? అని ఆరా తీసారు. వారు చూసిన ఫొటోలో ఇష్టపడిన వ్యక్తిలో ఎంత మగతనం, ఆత్మవిశ్వాసం, నవ్వించే తత్వం ఉన్నట్లు అనిపిస్తోందని కూడా అడిగారు. అనంతరం ఆ విద్యార్థినులకు ఫొటోలు లేకుండా, కేవలం లిఖిత పూర్వక సమాచారం ఉన్న ప్రొఫైళ్లు ఇచ్చారు.. మళ్లీ పైన పేర్కొన్న ప్రశ్నలనే అడిగారు.
ఈ సందర్భంగా ఆ అమ్మాయిలు ఆ ప్రొపైళ్ల యజమానుల్లో ఎవరు నిజంగా ఆకర్షణీయ పురుష పుంగవులో సరిగ్గా గుర్తించారని అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ రెబెక్కా బ్రాండ్ చెప్పారు. అందగాళ్లు కేవలం ఫొటోల్లోనే కాదు, తమ గురించి వివరించుకునే ప్రొపైల్ రాతలను కూడా ఆకర్షణీయంగానే తీర్చిదిద్దుకుంటూ, అమ్మాయిలను ఆకట్టుకుంటారని తెలిపారు. అయితే, శారీరకంగా అంతగా అందంగా లేని వారికి ఆన్‌లైన్ డేటింగ్ ఆశించినరీతిలో ఫలితాలను ఇవ్వడం లేదని కూడా చెప్పారు.