డీఎంకే అధినేత కరుణానిధి ఇంట అప్పుడే లొల్లి ప్రారంభం అయ్యింది. కరుణ కుమారుడు అళగిరి అప్పుడే తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. కరుణానిధి మరణం తర్వాత పార్టీ బాధ్యతలను స్వీకరించేందుకు స్టాలిన్ సిద్ధమవుతున్న వేళ, కరుణ మరో కుమారుడు అళగిరి తెరపైకి వచ్చారు. కరుణ స్మారక ప్రాంతం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. స్టాలిన్ నాయకత్వానికి సవాల్ విసిరారు.
డీఎంకే కేడర్ మొత్తం తన వెనకే ఉందని, నిజమైన డీఎంకే నేతలంతా తనవైపే ఉన్నారంటూ అళగిరి సంచలన కామెంట్స్ చేశారు. అళగిరి వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీకి చెందిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కానున్న ఒక రోజు ముందే అళగిరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైనాయి.
కాగా మంగళవారం కరుణానిధికి నివాళి అర్పించేందుకు డీఎంకే ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఏర్పాటు కానుంది. స్టాలిన్‌ను పార్టీ అధినేతగా ప్రకటించే జనరల్ కౌన్సిల్ సమావేశం తేదీని ఈ సమావేశంలో ప్రకటించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 1969లో అన్నాదురై చనిపోయినప్పుడు కూడా... ఇదే మాదిరి జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించడం గమనార్హం.