లోక్‌సభ - శాసనసభలకు ఏకకాల ఎన్నికల నిర్వహణకు ఓకే : అమిత్ షా లేఖ

గురువారం, 16 జూన్ 2016 (15:31 IST)
దేశంలో దిగువ సభ (లోక్‌సభ), అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనకు భారతీయ జనతా పార్టీ సమ్మతం తెలిపింది. ఈ మేరకు పార్లమెంటరీ స్థాయి సంఘానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధికారపూర్వకంగా లేఖ కూడా రాశారు. 
 
దేశ ఆర్థిక వ్యవస్థపై భారం తగ్గించడంతో పాటు విలువైన సమయం వృథా చేయకుండా ఉండేందుకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావిస్తున్నారు. దీనిపై భారత ఎన్నికల సంఘం కూడా సానుకూలంగా ఉంది. పైగా, అన్ని పార్టీల అభిప్రాయాలను కోరింది. ఈ నేపథ్యంలో ఏకకాల ఎన్నికలకు అమిత్ షా సమ్మతం తెలిపారు. పైగా, అన్ని పార్టీలతో విస్తృతస్థాయి చర్చ జరపాలని ఆయన భావిస్తున్నారు. 
 
సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని కూడా కోరినట్లు చెప్పారు. ఏకకాల ఎన్నికలకు అన్నాడీఎంకే, అసోం గణపరిషత్‌లు ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఎస్‌ఏడీ (శిరోమణి అకాలీదళ్) సుముఖత వ్యక్తం చేస్తూనే.. అన్ని అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించగలమా అని సందేహం వ్యక్తం చేసింది. 
 
మరోవైపు.. కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎన్‌సీపీలు ఈ ఆలోచనను తోసిపుచ్చగా, ఈ ఆలోచన అర్థవంతంగా ఉన్నప్పటికీ.. మధ్యంతర ఎన్నికలప్పుడు ఆచరణలో ఇబ్బందులు ఏర్పడుతాయని సీపీఎం అభిప్రాయపడింది. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మాత్రం తన స్పందనను వ్యక్తం చేయలేదు. 

వెబ్దునియా పై చదవండి