భోపాల్ నడిబొడ్డున విద్యార్థిని గ్యాంగ్‌ రేప్‌... విరామం తీసుకుంటూ మరీ....

శనివారం, 4 నవంబరు 2017 (11:01 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ నగరం నడిబొడ్డున ఐఏఎస్ పరీక్షల కోసం శిక్షణ తీసుకుంటున్న ఓ విద్యార్థినిపై నలుగురు కామాంధులు అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. టీ తాగేందుకు, గుట్కా వేసుకునేందుకు మధ్యమధ్యలో విరామాలు తీసుకుంటూ మరీ గ్యాంగ్ రేప్‌ చేశారు. ఆ తర్వాత తనపై గ్యాంగ్ రేప్ జరిగింది కేసు నమోదు చేయండి మొర్రో అని మొత్తుకుంటే పోలీసులు ఆ బాధితురాలితో "ఏం సినిమా కథ చెపుతున్నావా" అంటూ హేళనగా మాట్లాడారు. చివరకు ఆ బాధితురాలే నిందితులను గుర్తించి, గల్లాపట్టి లాక్కొస్తేగానీ ఖాకీలు కేసులు నమోదు చేయలేదు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
భోపాల్‌ నగర శివారు ప్రాంతానికి చెందిన ఓ యువతి ఐఏఎస్‌ పరీక్షల కోసం శిక్షణ తీసుకుంటోంది. ప్రతిరోజూ భోపాల్‌ నడిబొడ్డున ఉన్న హబీబ్‌ గంజ్‌ రైల్వే స్టేషన్‌ మీదుగా రాకపోకలు సాగించేంది. గురువారం సాయంత్రం.. కోచింగ్‌ సెంటర్‌ నుంచి రైల్వేష్టేషన్‌కు షార్ట్‌ కట్‌ రూట్‌లో వెళ్ళింది. ఆ సమయంలో ఆమెను ఇద్దరు తాగుబోతులు అటకాయించారు. బలవంతంగా చేతులు, కాళ్లు కట్టేసి, పక్కనున్న కల్వర్టు దగ్గరికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. 
 
మధ్యమధ్యలో సిగరెట్‌, తంబాకు కోసం విరామం ఇస్తూ గంటలపాటు యువతిపై అత్యాచారం చేశారు. దుస్తులు పూర్తిగా చినిగిపోవడంతో వేసుకోవడానికి ఏవైనా ఇమ్మని బాధితురాలు ప్రాధేయపడటంతో నిందితుల్లో ఒకడు ఇప్పుడే వస్తానని వెళ్లి, దుస్తులతోపాటు మరో ఇద్దరు స్నేహితులను వెంటబెట్టుకుని వచ్చాడు. నలుగురూ కలిసి ఆమెపై అకృత్యానికి పాల్పడ్డారు. ఈ రేప్ జరిగిన ప్రాంతం హబీబ్‌గంజ్‌ రైల్వే పోలీస్‌స్టేషన్‌కు కేవలం 100 మీటర్లు దూరంలో ఉంది. 
 
ఆ తర్వాత అక్కడ నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లిన బాధితురాలు.. తల్లిదండ్రులకు ఫోన్‌ చేసింది. ఆ రాత్రే.. తల్లిదండ్రులతో కలిసి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే స్టేషన్‌ ఇన్‌చార్జి.. బాధితులు చెప్పిన కథనాన్ని నమ్మలేదు. పైగా, ‘సినిమా కథలు చెబుతున్నారా?’ అని ఎద్దేవా చేశాడు.
 
దీంతో ఏం చేయలో తెలియక తన తండ్రితో కలిసి అసహాయ స్థితిలో పోలీస్‌ స్టేషన్‌ నుంచి బయటికొచ్చిన హబీబ్‌గంజ్‌ రైల్వే స్టేషన్‌ వైపునకు కదిలారు. సరిగ్గా అత్యాచారం జరిగిన ప్రదేశంలో తనను చెరబట్టిన ఇద్దరు కూర్చొని ఉండటం గమనించిన ఆ యువతి... తండ్రి సహాయంతో ఆ ఇద్దరినీ తన్ని, గల్లాపట్టుకొని ఈడ్చుకొచ్చి పోలీస్‌ స్టేషన్‌లో పడేసింది. అప్పటికిగానీ పోలీసులు కేసులు నమోదు చేయలేదు. 
 
ఈ వ్యవహారం ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రధానంగా ప్రసారం కావడంతో విపక్షాలు మండిపడుతూ ఆందోళనకు పిలుపునిచ్చాయి. దీంతో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించి.. తక్షణ చర్యగా ఫిర్యాదు నమోదు చేయడంలో అలసత్వం వహించిన పోలీస్‌ అధికారులను సస్పెండ్‌ చేశారు. బాధితురాలు అప్పగించిన ఇద్దరు నిందితుల ద్వారా మరో ఇద్దరిని పట్టుకున్నారు. మొత్తం నలుగురిపైనా నిర్భయ, తదితర చట్టాలకింద కేసు నమోదు చేశారు. భోపాల్‌ గ్యాంగ్‌ రేప్‌ ఘటనపై జాతీయ మహిళా కమిషన్‌ సైతం స్పందించింది. కేసు వివరాలు పంపాల్సిందిగా మధ్యప్రదేశ్‌ డీజీపీకి శుక్రవారం ఒక లేఖ రాసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు