తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గుండెపోటుతో డిసెంబర్ 5వ తేదీన తుదిశ్వాస విడిచారు. దీంతో తమిళ రాష్ట్రమంతా విషాదంలో మునిగిపోయింది. అమ్మ తమను అనాథలను చేసి వెళ్లిపోయిందంటూ ప్రజలు దీనంగా రోదించారు. ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోలేక 77 మంది మరణించారు. జయలలిత చనిపోయిందని తెలియగానే తమిళనాడులోని దుకాణాలు, హోటళ్లు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు.
జయలలిత చనిపోయిందన్న వార్త తెలియగానే అమ్మ క్యాంటీన్లను కూడా మూసేద్దామనుకున్నామని, కానీ ఆమె సంకల్పానికి తూట్లు పొడవడం ఇష్టం లేక ఆ తర్వాత కూడా క్యాంటీన్లను కొనసాగించామని నిర్వాహకులు తెలిపారు. అమ్మ ప్రతిక్షణం ప్రజల కోసం పరితపించేవారని, ఇలా ప్రజల ఆకలి తీరిస్తేనే ఆమె ఆత్మ శాంతిస్తుందనే ఉద్దేశంతోనే తమ సేవలు కొనసాగించినట్లు తెలిపారు. ఏదేమైనా వీరి ఉద్దేశం బాగుందని పలువురు అభినందిస్తున్నారు.