పెద్ద నోట్ల రద్దుతో బెంగళూరులో కొత్త సమస్య.. ఎస్బీఐలో చెక్ బుక్స్ కొరత...

బుధవారం, 28 డిశెంబరు 2016 (12:43 IST)
పెద్ద నోట్ల రద్దుతో దేశ ప్రజలంతా నానా తంటాలు పడుతుంటే.. నోట్ల రద్దుపై కేంద్రం ప్రకటించిన గడువు బుధవారంతో ముగిసిపోనుంది. అయినా చాలా ఏటీఎంల దగ్గర ఇప్పటికీ నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఇలా జనమంతా నోట్లు దొరక్క పాట్లు పడుతుంటే బెంగళూరులోని బ్యాంకులకు మాత్రం ఓ వింత సమస్య ఎదురైంది. బెంగళూరులోని చాలా బ్యాంకుల్లో చెక్ బుక్స్ సమస్యగా మారాయి. నోట్లను రద్దు చేయడంతో చాలామంది డిజిటల్ బాట పట్టారు. 
 
డిజిటల్ వ్యాలెట్లు, పీఓఎస్ మెషిన్లతో చెల్లింపులు జరుపుతున్నారు. చెక్ బుక్స్‌తో చెల్లింపులు చేయడం కూడా భారీగా పెరిగింది. దీంతో బ్యాంకు ఖాతాదారులు చెక్ బుక్స్ కోసం బ్యాంకులకు పదేపదే వస్తున్నారు. అయితే బ్యాంకు అధికారులు మాత్రం ఖాతాదారులకు చెక్ బుక్స్ సరిపడినన్ని చెక్ బుక్స్ అందించలేక, వారికి సమాధానం చెప్పలేక తంటాలు పడుతున్నారు. 
 
బెంగళూరులోని ఓ ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా కొత్త చెక్ బుక్స్ నెల క్రితమే అందించి ఉండాల్సిందని, ప్రభుత్వం తాత్సారం చేయడంతో ప్రస్తుతం చెక్ బుక్స్‌కు కొరత ఏర్పడిందని అభిప్రాయపడ్డారు.

వెబ్దునియా పై చదవండి