ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చిన్నారుల మరణ మృదంగం కొనసాగుతోంది. ముఖ్యంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జిల్లా గోరఖ్‌పూర్‌లో ఈ మృత్యుఘోష మరింత ఎక్కువగా ఉంది. గత ఆగస్టులో ఆక్సిజన్ సరఫరా ఆగిపోవడంతో 63 మంది చిన్నారుల మృతి చెందగా, గడచిన 24 గంటల్లో 16 మంది చనిపోయారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వర్గాలు ధృవీకరించాయి.
వీరిలో 10 మంది చిన్నారులు నియోనాటర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతూ మరణించగా, మరో ఆరుగురు పీడియాట్రిక్ ఐసీయూలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. వీరంతా మెదడువాపు వ్యాధితో బాధపడ్డారని వైద్యులు తెలిపారు. దీంతో ఈ యేడాది జనవరి నుంచి ఈ ఆసుపత్రిలో 310 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఆస్పత్రుల్లో సౌకర్యాల మెరుగు కోసం ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం గమనార్హం.