సార్వత్రిక సమరం కోసం కాంగ్రెస్ పార్టీ తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 39 మంది అభ్యర్థులతో కూడిన ఈ జాబితాను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాధీ మరోమారు కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్న విషయం తెల్సిందే.
అలాగే, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉండగా ప్రస్తుతం 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. జహీరాబాద్ - సురేశ్ కుమార్ షేట్కర్, నల్గొండ - కుందూరు రఘువీర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ - చల్లా వంశీచందర్‌రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్‌లను అభ్యర్థులుగా అధిష్ఠానం ఖరారు చేసింది. తొలి జాబితాలో ఉన్న 39 మందిలో 15 మంది జనరల్.. 24 మంది ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/మైనార్టీ కేటగిరీకి చెందినవారు ఉన్నట్లు వేణుగోపాల్ తెలిపారు. 12 మంది అభ్యర్థులు 50 ఏళ్లు లోపువారేనన్నారు.
ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీపీపీ నేత సోనియాగాంధీ, కేసీ వేణుగోపాల్‌ల నేతృత్వంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ గురువారం ఢిల్లీలో సమావేశమై తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, హర్యానా, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మణిపుర్ రాష్ట్రాల్లోని అభ్యర్థులను ఖరారుచేసే అంశంపై కసరత్తు చేసింది. ఇందులో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీతోపాటు పార్టీ సీనియర్ నేతలు జైరాం రమేశ్, అధీర్‌రంజన్ చౌధరి, అంబికాసోని, ముకుల్‌వాస్నిక్, టీఎం సింగ్‌దేవ్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ వర్చువల్‌గా హాజరయ్యారు.