వ్యాక్సిన్ల సేకరణను ప్రభుత్వం సరళీకరించడంతో దేశీ వ్యాక్సిన్ తయారీదారులు ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు సన్నద్ధమయ్యారు. మే 1 నుంచి 18 ఏండ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతించడంతో వ్యాక్సిన్ తయారీని ముమ్మరం చేయాలని ఫార్మా కంపెనీలు కసరత్తు సాగిస్తున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వ్యాక్సిన్ తయారీదారులతో మాట్లాడుతూ ఉత్పత్తి సామర్ధ్యం పెంచాలని కోరిన సంగతి తెలిసిందే. జూన్ నుంచి సీరం ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ ల వ్యాక్సిన్ల సరఫరాలతో పాటు స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ల దిగుమతులు ఊపందుకుంటాయని భావిస్తున్నారు.
మరోవైపు వ్యాక్సిన్ తయారీదారులతో ధరలపై సంప్రదింపులు జరపాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, ప్రైవేట్ ఆస్పత్రులను కోరింది. అంతర్జాతీయ మార్కెట్ లో పోటీకి దీటుగా ఉండేలా ధరలు ఉండాలని వ్యాక్సిన్ తయారీదారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.