నీ వొదినను పెళ్లాడు... తండ్రి బలవంతం... ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

శుక్రవారం, 15 డిశెంబరు 2017 (14:00 IST)
అతడికి 15 ఏళ్లు. 9వ తరగతి చదువుతున్నాడు. తన అన్నయ్య చనిపోవడంతో వొదిన విధవరాలయ్యింది. ఐతే తన తండ్రి నుంచి అతడికి ఓ విన్నపం వచ్చింది. భర్త లేని వొదినను పెళ్లాడాలనేది ఆ సూచన. మరి అతడు ఏం చేశాడు?
 
వివరాల్లోకి వెళితే... బీహార్ రాష్ట్రంలో రామ్న వినోబనగర్‌లో చంద్రేశ్వర్ దాస్ నివాసముంటున్నాడు. అతడికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడికి రూబీ దేవితో 2009లో వివాహం జరిపించాడు. వారికి ఇద్దరు పిల్లలు కలిగారు. ఐతే రూబీ దేవి భర్త సతీష్ విద్యుత్ షాక్ తగలడంతో 2013లో మృత్యువాత పడ్డాడు. ఇక అప్పట్నుంచి ఇంటి బాధ్యతల విషయంలో 9వ తరగతి చదువుతున్న రెండో కుమారుడు చేదోడువాదోడుగా వుంటూ వస్తున్నాడు. 
 
ఇలావుండగానే, బాలుడి తండ్రి చంద్రేశ్వర్‌కు ఓ ఆలోచన వచ్చింది. భర్త లేని తన కోడలికి తన రెండో కుమారుడు తోడుగా వుంటే బావుంటుందని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆమె కంటే 10 ఏళ్లు చిన్నవాడైన రెండో కుమారుడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. విషయాన్ని కోడలి తల్లిదండ్రులకు కూడా చెప్పాడు. వారు కూడా చేసేదేమి లేక సరేనన్నారు. భర్త పోయిన బాధలో రూబీ మౌనంలో వుండిపోయింది. కానీ బాలుడు మాత్రం ససేమిరా అన్నాడు.
 
ఐనప్పటికీ తండ్రి తీవ్రంగా బలవంతపెట్టాడు. అలా జరిగిన కొన్ని గంటల్లోనే బాలుడు తనలోనే మథనపడిపోయాడు. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం పోలీసులకు చేరడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు